ఏసీలో గ్యాస్ ప్రెజర్ కరెక్ట్ గా ఎంత ఉండాలి?
- ఏసీ గ్యాస్ రీఫిల్ పేరుతో అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్త
- గ్యాస్ వాడకంతో అయిపోదు, లీక్ ఉంటేనే తగ్గుతుంది
- సర్వీసింగ్ సమయంలో ప్రెజర్ గేజ్ రీడింగ్ అడగడం ముఖ్యం
- వివిధ రకాల గ్యాస్‌లకు వేర్వేరు ప్రెజర్ లెవెల్స్ ఉంటాయి
- కాయిల్స్, ఫిల్టర్లు శుభ్రం చేసినా కొన్నిసార్లు సమస్య పరిష్కారమవుతుంది
సాధారణంగా ఏసీలో ఉండే రిఫ్రిజెరెంట్ (గ్యాస్) ఒక క్లోజ్డ్ లూప్‌లో తిరుగుతుంది. అది వాడకంతో అయిపోయే ఇంధనం కాదు. ఒకవేళ గ్యాస్ తగ్గిందంటే, సిస్టమ్‌లో ఎక్కడో లీక్ ఉన్నట్లే లెక్క. ఈ విషయం తెలియక చాలామంది, టెక్నీషియన్లు చెప్పిన వెంటనే గ్యాస్ నింపడానికి వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సాధారణ సర్వీసింగ్‌కు రూ. 500 నుంచి రూ. 2,000 వరకు అవుతుండగా, గ్యాస్ రీఫిల్‌కు రూ. 1,500 నుంచి రూ. 4,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
గ్యాస్ ప్రెజర్ ఎంత ఉండాలి?
గ్యాస్ రీఫిల్ చేయాలని టెక్నీషియన్ చెప్పినప్పుడు, ముందుగా ప్రెజర్ గేజ్‌తో రీడింగ్ చూపించమని అడగడం చాలా ముఖ్యం. ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌పై ఉన్న స్టిక్కర్‌ను బట్టి అందులో ఏ రకం గ్యాస్ ఉందో తెలుసుకోవచ్చు. వివిధ గ్యాస్‌లకు ఉండాల్సిన ప్రెజర్ లెవెల్స్ కింద ఇవ్వబడ్డాయి:
R-32 (కొత్త ఏసీలలో): కంప్రెసర్ రన్నింగ్‌లో (ఆపరేటింగ్) ప్రెజర్ 110-130 psi, ఏసీ ఆఫ్‌లో ఉన్నప్పుడు (స్టాండింగ్) ప్రెజర్ 240-250 psi ఉండాలి.
R-410A: ఆపరేటింగ్ ప్రెజర్ 110-130 psi, స్టాండింగ్ ప్రెజర్ 220-230 psi ఉండాలి.
R-22 (పాత ఏసీలలో): ఆపరేటింగ్ ప్రెజర్ 60-70 psi, స్టాండింగ్ ప్రెజర్ 150-160 psi మధ్య ఉండాలి.
కొన్నిసార్లు ఏసీ ఫిల్టర్లు లేదా కాయిల్స్ మురికిగా ఉండటం వల్ల కూడా కూలింగ్ తగ్గి, గ్యాస్ తక్కువగా ఉన్నట్లు తప్పుడు సంకేతాలు వస్తాయి. వాటిని శుభ్రం చేస్తేనే సమస్య పరిష్కారం కావచ్చు. ఒకవేళ నిజంగానే గ్యాస్ తక్కువగా ఉంటే, లీక్‌ను గుర్తించి దానికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరడం మంచిది. ఈ విషయాలపై అవగాహనతో వ్యవహరిస్తే అనవసర ఖర్చులను నివారించవచ్చు.