మమతా బెనర్జీకి, రితబ్రత వర్గానికి మధ్య దూరం పెరిగింది ఈ ఘటనతోనేనా..?

Ritabrata Banerjee and Mamata Banerjee distance grows after this incident
  • పశ్చిమ బెంగాల్ టీఎంసీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం
  • మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు
  • రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీకి ప్రతిపక్ష నేతగా గుర్తింపు
  • మరింత మంది ఎమ్మెల్యేలు తమతో చేరతారని రితబ్రత ప్రకటన
  • మమతకు విధేయులమంటూనే అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకున్న రెబల్స్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వైఖరే ఈ దుస్థితికి కారణమంటూ, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలో పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల లోపు మరికొంత మంది ఎమ్మెల్యేలు తమ వర్గంలో చేరతారని ఆయన శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనకు తెరదించిన నేపథ్యంలో టీఎంసీలో అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేలలో సుమారు 58 నుండి 61 మంది రితబ్రత బెనర్జీకి మద్దతు ప్రకటించారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్, ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం గమనార్హం. దీంతో తృణమూూల్ కాంగ్రెస్‌లో రాజకీయం సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.

"టీఎంసీలో నెలకొన్న ప్రస్తుత దుస్థితికి అభిషేక్ బెనర్జీయే ప్రధాన కారణం" అని రితబ్రత స్పష్టం చేశారు. ఆయన నియంతృత్వ పోకడలు, అందుబాటులో ఉండకపోవడం, మితిమీరిన కుటుంబ రాజకీయాల వల్లే పార్టీకి ఈ గతి పట్టిందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల అనంతరం మే 6న మమత బెనర్జీ నివాసంలో జరిగిన సమావేశంలో, పార్టీ ఓటమిని అంగీకరించకుండా అభిషేక్‌కు బలవంతంగా 'స్టాండింగ్ ఒవేషన్' ఇప్పించారని ఆయన ఆరోపించారు. అభిషేక్ కు పైకిలేచి చప్పట్లు కొట్టాలంటూ బలవంతంగా ఆదేశించారని వెల్లడించారు. అయినప్పటికీ, తమకు మమతా బెనర్జీ నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, ఆమె పట్ల ఎల్లప్పుడూ విధేయులమేనని ఆయన పునరుద్ఘాటించారు. కానీ అభిషేక్ నాయకత్వాన్ని బలవంతంగా రుద్దడం మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మమత నాయకత్వంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొంటున్నారు. మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు టీఎంసీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. జూన్ 18 నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ రాజకీయ పరిణామాలు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.
Go Back to Shorts
Ritabrata Banerjee
Mamata Banerjee
Abhishek Banerjee
Trinamool Congress
West Bengal politics
TMC internal crisis

More Telugu News