పాకిస్థాన్‌లో విదేశాంగ విధాన నిర్ణయాల్లో సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ అంగీకరించారు. పౌర ప్రభుత్వం, సైనిక నాయకత్వం కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయని పేర్కొన్నారు. దేశంలో అమలవుతున్నది సంప్రదాయ ప్రజాస్వామ్య పాలన కాదని, ఇది ఒక ‘హైబ్రిడ్‌ వ్యవస్థ’ అని వివరించారు.

బ్రిటిష్‌-అమెరికన్‌ జర్నలిస్ట్‌ మెహ్దీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆసిఫ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో సైన్యాధిపతి అసిమ్‌ మునీర్‌కు ప్రభుత్వ పెద్దల కంటే ఎక్కువ అధికారం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. సైన్యం, పౌర నాయకత్వం మధ్య నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయని చెప్పారు. అయితే అధికార పంపిణీ సమానంగా లేదని కూడా అంగీకరించారు.

దేశంలో సైన్యం పాత్రను ప్రస్తావిస్తూ.. గతంలో సైనిక పాలకుల కారణంగా ఈ వ్యవస్థ మరింత స్పష్టంగా కనిపించిందని ఆసిఫ్‌ అన్నారు. అమెరికాలోనూ ప్రభుత్వ నిర్ణయాల వెనుక ‘డీప్‌ స్టేట్‌’ ఉందని వ్యాఖ్యానించారు. అయితే పాకిస్థాన్‌లో ప్రస్తుతం సైనిక పాలన లేదని, సైన్యం ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తోందని ఆయన గతంలోనూ పలుమార్లు సమర్థించారు. 

2025లో అరబ్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆసిఫ్‌ పాకిస్థాన్‌ పాలనా విధానాన్ని ‘హైబ్రిడ్‌ మోడల్‌’గా అభివర్ణించారు. సైనిక, పౌర నాయకత్వం కలిసి అధికారాన్ని నిర్వహిస్తున్నాయని, ఆర్థిక, పాలనా సమస్యల నుంచి దేశం బయటపడే వరకు ఈ విధానం అవసరమని పేర్కొన్నారు. సైన్యం, ప్రభుత్వం కలిసి పనిచేయడానికి ప్రత్యేక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి వంటి ఉమ్మడి వేదికలు ఉన్నాయని వివరించారు. 

పాకిస్థాన్‌లో సైన్యం రాజకీయాలు, భద్రత, విదేశాంగ విధానాలపై దశాబ్దాలుగా ప్రభావం చూపుతోంది. 1958, 1977, 1999లో సైనిక తిరుగుబాట్ల ద్వారా నేరుగా అధికారాన్ని చేపట్టింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా కీలక నిర్ణయాల్లో సైన్యం ప్రభావం కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.