ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
- బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ గతంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఫిర్యాదు
- కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీరి నుంచి వివరాలు సేకరించిన సిట్
- వీరి ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి (మహబూబ్‌నగర్), జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఈరోజు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ముందు విచారణకు హాజరయ్యారు.
గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు అక్రమంగా ట్యాపింగ్‌కు గురయ్యాయని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా స్పందించిన సిట్ అధికారులు... సెక్షన్ 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వారిని పిలిపించి వివరాలను సేకరించారు.
గతంలో జారీ చేసిన నోటీసులకు అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యేలు హాజరుకాలేకపోవడంతో, సిట్ మరోసారి తాజా నోటీసులు ఇచ్చి పిలిపించింది. ఈ విచారణ సందర్భంగా అధికారులు సేకరించిన సాక్ష్యాలను వారి ముందుంచి, వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేసిందంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది.