ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి అతి చేరువగా వచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నిలకడగా రాణించిన గిల్, బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా, గిల్ 801 పాయింట్లతో కేవలం ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. త్వరలోనే గిల్ అగ్రస్థానాన్ని అధిరోహించే అవకాశం ఉంది.

ఈ జాబితాలో భారత బ్యాటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. గిల్‌తో పాటు విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో మూడో స్థానంలో, కెప్టెన్ రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. దీంతో వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ 188 పరుగులు సాధించడం అతడి ర్యాంకు మెరుగుపడటానికి దోహదపడింది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకోగా, ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ అద్భుతంగా రాణించాడు. సిరీస్ మొత్తం అజేయంగా నిలిచి 249 పరుగులు చేసిన రూట్, నాలుగు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకుకు చేరుకున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ రెండో స్థానంలో ఉండగా, భారత్‌తో సిరీస్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ 10 స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో న్యూజిలాండ్ ఆటగాడు మైఖేల్ బ్రేస్‌వెల్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్‌లోనే ఉత్తమంగా మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆఫ్ఘ‌నిస్థాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్ ఈ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.