Advertisement

16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ

Lalit Modi cleared in FEMA case set to return home
  • ఫెమా కేసులో ట్రైబ్యునల్ అనుకూల తీర్పు
  • ఈడీ ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టీకరణ
  • 2009 ఐపీఎల్‌ దక్షిణాఫ్రికా నిర్వహణ కేసుకు సంబంధించిన తీర్పు
  • ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది రానున్నట్లు వెల్లడి
  • అక్టోబర్‌లో మనవడు పుట్టిన తర్వాతే భారత్‌కు రాక
  • 2010 నుంచి విదేశాల్లోనే ఉంటున్న లలిత్ మోదీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్‌కు సంబంధించిన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్ తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌కు వస్తానని వెల్లడించారు.

2009 ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు జరిగిన విదేశీ నిధుల బదిలీల్లో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. అయితే ఆ నిధుల బదిలీలు కరెంట్ అకౌంట్ లావాదేవీలేనని, క్యాపిటల్ అకౌంట్ లావాదేవీలు కాదని ట్రైబ్యునల్ స్పష్టం చేస్తూ ఈడీ ఆరోపణలకు ఆధారం లేదని తేల్చింది. దీంతో లలిత్ మోదీపై విధించిన ప్రధాన జరిమానాలు, ఆరోపణలు రద్దయ్యాయి.

ఈ తీర్పుతో 16 ఏళ్లుగా తాను చెబుతున్నదే నిజమని నిరూపితమైందని లలిత్ మోదీ అన్నారు. ఐపీఎల్ అభివృద్ధే తన లక్ష్యమని, ఇప్పుడు ఆ అధ్యాయం ముగిసిందని చెప్పారు. అక్టోబర్‌లో తన కుమార్తెకు బిడ్డ పుట్టిన తర్వాత భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్నట్లు తెలిపారు.

2010లో భారత్ విడిచి వెళ్లిన లలిత్ మోదీపై ఈడీతో పాటు బీసీసీఐ, ఆదాయపు పన్ను శాఖలు కూడా పలు విచారణలు చేపట్టాయి. అప్పటి నుంచి విదేశాల్లోనే ఉంటున్న ఆయన, తాజా ట్రైబ్యునల్ తీర్పుతో భారత్‌కు తిరిగి వచ్చే మార్గం సుగమమైందని భావిస్తున్నారు.
Advertisement
Lalit Modi
IPL Founder
FEMA Case
IPL 2009 South Africa
Enforcement Directorate
Indian Premier League

More Telugu News