పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!

పాత ప్యాంటు జేబులో రూ. 57 కోట్ల లాటరీ టికెట్.. చివరి నిమిషంలో మారిన తలరాత!

US Man Finds Rs 57 Crore Lottery Ticket In Old Pants Days Before Expiry
  • ఏడాది క్రితం కొని పూర్తిగా మర్చిపోయిన వ్యక్తి
  • గడువు ముగియడానికి 8 రోజుల ముందు వెలుగులోకి
  • లాటరీ అధికారుల ప్రకటనతో ఇంట్లో వెతకగా దొరికిన అదృష్టం
  • అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఆసక్తికర ఘటన
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. దాదాపు ఏడాది క్రితం కొని, పూర్తిగా మర్చిపోయిన ఓ లాటరీ టికెట్.. అతడిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. గడువు ముగియడానికి కేవలం 8 రోజుల ముందు, ఓ పాత ప్యాంటు జేబులో ఆ టికెట్ దొరకడం ఈ కథలో అసలు ట్విస్ట్‌.

వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గతేడాది మే నెలలో తాను తరచూ వెళ్లే ఓ గ్యాస్ స్టేషన్‌లో పిక్-6 లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అయితే, కొన్న తర్వాత ఆ టికెట్‌ను ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. దాదాపు ఏడాది పాటు దాని గురించి అతడికి గుర్తురాలేదు.

ఇటీవల లాటరీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. జాక్‌పాట్ గెలిచిన టికెట్ ఒకటి ఇంకా ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుందని తెలిపారు. తాను తరచూ వెళ్లే గ్యాస్ స్టేషన్‌లోనే ఆ టికెట్ అమ్ముడైందని తెలియడంతో ఆ వ్యక్తికి ఆసక్తి కలిగింది. వెంటనే అక్కడికి వెళ్లి సిబ్బందిని విచారించగా, తమ రెగ్యులర్ కస్టమర్లలో కొద్దిమంది మాత్రమే ఆ లాటరీలో పాల్గొంటారనీ, ఇంట్లో జాగ్రత్తగా వెతుక్కోమని వారు సలహా ఇచ్చారు.

దీంతో ఇంటికి వచ్చిన అతను.. బీరువాలు, అరలు, పాత వస్తువులన్నీ వెతికాడు. చివరకు పాత బట్టలు ఉన్న చోట వెతుకుతుండగా ఓ పాత ప్యాంటు జేబులో నలిగిపోయిన ఆ లాటరీ టికెట్ కనిపించింది. నంబర్లు సరిచూసుకోగా, తాను గెలుచుకున్నది 5.9 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 57.11 కోట్లు) జాక్‌పాట్ అని తెలిసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. వెంటనే లాటరీ కార్యాలయానికి వెళ్లి గడువుకు 8 రోజుల ముందే బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో పాత టికెట్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని, చాలామంది విజేతలు వాటిని ఎక్కడ పెట్టారో మర్చిపోయి బహుమతులు కోల్పోతున్నారని లాటరీ అధికారులు ప్రజలకు సూచించారు.
Advertisement
Lottery Winner
New Jersey
Lottery Ticket
Pick-6 Lottery
Jackpot
57 Crore Rupees
Gas Station
Unclaimed Prize
Lottery Claim

More Telugu News