వయసు పెరిగే కొద్దీ శరీరంలో బలం తగ్గడం సహజం. కండరాలు బలహీనపడతాయి. వ్యాయామం చేయడమే కష్టంగా మారుతుంది. కానీ జపాన్‌కు చెందిన 90 ఏళ్ల కోషిసుకే కనజావా మాత్రం ఇందుకు భిన్నం. ఈ వయసులోనూ జిమ్‌లో బరువులు ఎత్తుతున్నారు. పుల్‌అప్స్‌ చేస్తున్నారు. అంతేకాదు.. బాడీబిల్డింగ్‌ పోటీల్లోనూ పాల్గొని విజేతగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆయన ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం వెనుక ఉన్న అలవాట్లేంటో తెలుసుకుందాం.

90 ఏళ్ల వయసులోనూ పోటీల్లో విజయం
జపాన్‌లోని షిమానే ప్రాంతంలో 1936లో కనజావా జన్మించారు. తొలుత ఒలింపిక్స్‌లో స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొనాలని కలలు కన్నారు. అయితే కండరాలకు సంబంధించిన సమస్యతో ఆ ఆశ నెరవేరలేదు. దీంతో బాడీబిల్డింగ్‌ వైపు అడుగులు వేశారు. ఐదేళ్ల పాటు రోజుకు ఆరు గంటల వరకు సాధన చేశారు. 24 ఏళ్ల వయసులో మిస్టర్‌ జపాన్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. 1967లో మిస్టర్‌ యూనివర్స్‌ పోటీల్లో నాలుగో స్థానం సాధించారు. 80 ఏళ్లు దాటిన తర్వాత ఆరుసార్లు ప్రపంచ మాస్టర్స్‌ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌గా నిలిచారు. తాజాగా 85 ఏళ్లు పైబడిన విభాగంలో జపాన్‌ మాస్టర్స్‌ బాడీబిల్డింగ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకున్నారు.

ఆహారంలో ఇవే ప్రత్యేకతలు
కనజావా తన ఆరోగ్యానికి క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లే కారణమని చెబుతారు. జీవితాంతం ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉన్నారు. మాంసం, చేపల వినియోగాన్ని కూడా దశాబ్దాల క్రితమే మానేశారు. బ్రౌన్‌ రైస్‌, నాటో (పులియబెట్టిన సోయాబీన్స్‌), మిసో సూప్‌, గుడ్లు ఆయన ఆహారంలో ప్రధానంగా ఉంటాయి. గతంలో రోజుకు ఆరు ప్రొటీన్‌ షేక్స్‌ తీసుకునేవారు. వయసు పెరిగేకొద్దీ వాటిని మూడుకు తగ్గించారు.

వయసుకు తగ్గట్టుగా వ్యాయామం
90 ఏళ్ల వయసులోనూ పుల్‌అప్స్‌, లెగ్‌ ప్రెస్‌ వంటి వ్యాయామాలు చేస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా భారీ బరువులు ఎత్తడం లేదు. స్క్వాట్స్‌, బెంచ్‌ ప్రెస్‌ వంటి వ్యాయామాలకు దూరంగా ఉంటున్నారు. ఫ్రీ వెయిట్స్‌ బదులు జిమ్‌ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. శరీర సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామ పద్ధతులను మార్చుకుంటున్నారు.

వృద్ధాప్యంలో కండరాల బలానికి..
వయసు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం, బలం తగ్గడాన్ని వైద్య పరిభాషలో సార్కోపీనియా అంటారు. దీన్ని ఎదుర్కోవడానికి క్రమం తప్పకుండా శక్తిని పెంచే వ్యాయామాలు చేయడం ఉపయోగపడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు వారానికి 150 నుంచి 300 నిమిషాల మోస్తరు తీవ్రత కలిగిన శారీరక శ్రమతో పాటు కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. అయితే కొత్తగా వ్యాయామం ప్రారంభించేవారు వైద్యుల సలహాతో, నెమ్మదిగా మొదలుపెట్టాలి.