ప్రజా వినతుల్లో 'భూ' ప్రకంపనలు.. ద్వారంపూడిపై ఆరోపణలు.. కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపుతామన్న మంత్రి సుభాష్
- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల కార్యక్రమం చేసట్టిన మంత్రి వాసంశెట్టి
- ద్వారంపూడి ప్రోత్సాహంతో మేయర్ భర్త విద్యాసాగర్ భూమి కబ్జా చేసినట్టు ఫిర్యాదు
- భూములను కాజేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరిక
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా వినతుల స్వీకరణ' కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత ప్రభుత్వ హయాంలో భూదందాలు, కబ్జాలతో తమకు అన్యాయం జరిగిందంటూ వారు ఆవేదన వెలిబుచ్చారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ బీ.టీ. నాయుడు నేరుగా అర్జీలు స్వీకరించి, బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత వైసీపీ పాలనలో అండదండలతో సాగిన భూ కబ్జాలు, అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారని తెలిపారు. పేదల భూములను కాజేసిన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
ప్రధాన ఫిర్యాదుల వివరాలు:
మేయర్ భర్త కబ్జా: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రోత్సాహంతో మేయర్ భర్త సుంకర విద్యాసాగర్ తన రూ. 10 కోట్ల వారసత్వ ఆస్తిని కబ్జా చేసి అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నారని వెంకటరమణ అనే బాధితుడు ఫిర్యాదు చేశారు.
వరుస భూదందాలు: నంద్యాల, కర్నూలు, విజయనగరం జిల్లాల నుంచి వచ్చిన బాధితులు తమ పట్టా భూములను వైసీపీ నేతలు, సర్పంచులు అక్రమంగా ఆక్రమించుకున్నారని మొరపెట్టుకున్నారు.
రీ-సర్వే లోపాలు: బాపట్ల, కోనసీమ జిల్లాల రైతులు రీ-సర్వే వల్ల తమ భూములు వెబ్ ల్యాండ్‌లో అదృశ్యమయ్యాయని, అధికారుల పొరపాట్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని అర్జీలు సమర్పించారు.
దౌర్జన్యాలు: వైసీపీ ఎంపీటీసీలు, నేతలు భూ సరిహద్దులు మార్చి దారి లేకుండా చేస్తున్నారని, ఎదురుతిరిగితే దాడులకు దిగుతున్నారని సత్యసాయి జిల్లా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు తీసుకుని తీసుకుని సర్వే చేయని అధికారులు, పట్టా భూములను నోషనల్ ఖాతాలోకి మార్చిన రెవెన్యూ సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.