గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ తన పతకాల సంఖ్యను మరింత పెంచుకుంది. నిన్న‌ జరిగిన పోటీల్లో వెయిట్‌లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించగా, డిస్కస్ త్రోయర్ సీమా కలిరమణ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్ ఇప్ప‌టివ‌ర‌కు సాధించిన‌ పతకాల సంఖ్య 17కి (3 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) చేరింది. 

పురుషుల +110 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో లవ్‌ప్రీత్ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో మొత్తం 388 కేజీల (స్నాచ్‌లో 176 కేజీలు + క్లీన్ అండ్ జర్క్‌లో 212 కేజీలు) బరువును ఎత్తి రజత పతకాన్ని ముద్దాడాడు. స్నాచ్ విభాగంలో 176 కేజీలు ఎత్తి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు సృష్టించిన లవ్‌ప్రీత్, ఆ దశ తర్వాత అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, న్యూజిలాండ్ లిఫ్టర్ డేవిడ్ ఆండ్రూ లిటి క్లీన్ అండ్ జర్క్‌లో 223 కేజీలతో గేమ్స్ రికార్డు నెలకొల్పి, మొత్తం 389 కేజీలతో స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. దీంతో లవ్‌ప్రీత్ కేవలం ఒక్క కిలో తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు. 2022 బర్మింగ్‌హామ్ క్రీడల్లో కాంస్యం గెలిచిన లవ్‌ప్రీత్, ఈసారి తన ప్రదర్శనను మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రీడల్లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ మొత్తం 8 పతకాలు (ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఒక కాంస్యం) సాధించి తన ప్రస్థానాన్ని ముగించింది.

అథ్లెటిక్స్‌లో మహిళల డిస్కస్‌త్రోలో సీమా కలిరమణ 58.65 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. తల్లయ్యాక తిరిగి పోటీల్లోకి రావడం, పీహెచ్‌డీ చేస్తూనే ఈ ఘనత సాధించడం విశేషం. పోటీలో మూడుసార్లు ఫౌల్ చేసినప్పటికీ, మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడంలో ఆమె సఫలమైంది. ఈ విభాగంలో జమైకాకు చెందిన సమంత హాల్ (61.66 మీ) స్వర్ణం, కెనడాకు చెందిన జూలియా టంక్స్ (60.67 మీ) రజతం గెలుచుకున్నారు. మరో భారత క్రీడాకారిణి నిధి రాణి 55.67 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

అయితే, కొన్ని విభాగాల్లో భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల 200 మీటర్లు, 400 మీటర్ల విభాగాల్లో అనిమేష్ కుజుర్, విశాల్ టీకే ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. మహిళల 5000 మీటర్లలో పారుల్ చౌదరి 13వ స్థానంతో సరిపెట్టుకుంది. షాట్‌పుట్‌లో తాజిందర్‌పాల్ సింగ్ తూర్, సమర్‌దీప్ సింగ్ గిల్ వరుసగా ఐదు, ఏడో స్థానాల్లో నిలిచారు. లాన్ బౌల్స్‌లో మాత్రం నవనీత్ సింగ్, దినేష్ కుమార్ జోడీ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది.