తిరుపతి నుంచి తళ్లికి బస్సు నడపాలన్న తమిళనాడు ఎన్డీయే నేతలు.. వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు
- తమిళనాడులోని తళ్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- భాష ఏదైనా మనమంతా ద్రవిడులమేనని సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేశారు
- మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే, కాంగ్రెస్ అడ్డుకున్నాయని విమర్శ
- గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేసి దక్షిణాదికి న్యాయం చేస్తామని హామీ
- తమిళనాడు అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపు
చారిత్రక, సాంస్కృతిక బంధాలను గుర్తుచేస్తూ, "ఎన్నో దాడులు జరిగినా తమిళ సంస్కృతి తన ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకుంది. ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళ గడ్డ మీద నుంచే మొదలైంది. రెండు రాష్ట్రాల సరిహద్దులోని చిత్తూరు నుంచే నేను వచ్చాను. చెన్నై దాహార్తిని తీర్చడానికి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇచ్చారు. మనం అన్నదమ్ముల్లా కలిసి అభివృద్ధి చెందుతున్నాం" అని చంద్రబాబు వివరించారు. ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, ఈ బంధం విడదీయరానిదని పేర్కొన్నారు.
అనంతరం జాతీయ రాజకీయాలు, డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకు దూసుకెళ్తోందని ప్రశంసించారు. "భారత్‌ను ప్రపంచ పటంలో గౌరవప్రదమైన స్థానంలో నిలిపిన ఘనత మోదీదే. ఆయన 'వికసిత్ భారత్' కోసం స్పష్టమైన విజన్‌తో పనిచేస్తున్నారు. కానీ తమిళుల, దేశ ప్రయోజనాలు పట్టని కొన్ని పార్టీలు ఇక్కడ ఉన్నాయి" అని డీఎంకే, కాంగ్రెస్‌లను ఉద్దేశించి అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ, "మహిళలకు సమాజంలో సమాన గౌరవం కల్పించేందుకు మోదీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు దానిని అడ్డుకున్నాయి. ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోంది. మహిళా బిల్లును అడ్డుకుని వారేం సాధించారు? గతంలోనూ కాంగ్రెస్ ఇదే బిల్లుకు సహకరించలేదు. క్రెడిట్ మీరే తీసుకోండని ప్రధాని చెప్పినా ఈ పార్టీలు బిల్లును ఓడించాయి. దీనిపై డీఎంకే సమాధానం చెప్పాలి" అని డిమాండ్ చేశారు.
తమిళనాడులో పాలన గాడి తప్పిందని, రాష్ట్రం అన్ని అంశాల్లో వెనుకబడిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. "డీఎంకే పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. శాంతిభద్రతలు క్షీణించాయి. డ్రగ్స్, మహిళలపై దాడులు, కస్టోడియల్ మరణాలు పెరిగాయి. మద్యం ధరలు పెంచి డీఎంకే ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటోంది" అని విమర్శించారు. తమిళనాడుకు పూర్వ వైభవం రావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఏపీలో గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని 22 నెలల్లోనే వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు.
"గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. గంగ-కావేరి కలవాలి. దక్షిణాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను" అని హామీ ఇచ్చారు. అభివృద్ధి, ఉద్యోగాల కోసం కేంద్ర సహకారం అవసరమని, జయలలిత స్ఫూర్తితో అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. ఎన్డీఏకు వేసే ప్రతి ఓటు తమిళనాడు భవిష్యత్తును గెలిపిస్తుందని అన్నారు.