చిన్నారి గొంతులో దూరిన ఆక్వేరియం చేప.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

Indore Baby Saved After Aquarium Fish Gets Stuck in Throat
షార్ట్స్‌లో చూడండి
ఇంట్లోని ఆక్వేరియం శుభ్రం చేస్తుండగా జరిగిన ఓ వింత ఘటన ఏడాది బాలుడి ప్రాణాల మీదకు వచ్చింది. ప్రమాదవశాత్తు ఓ చేప చిన్నారి గొంతులో ఇరుక్కుపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వైద్యులు వెంటనే స్పందించి చికిత్స ద్వారా చేపను తొలగించి బాలుడిని కాపాడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది.

అస‌లేం జ‌రిగిందంటే..! 
ఈ నెల‌ 3వ తేదీన ఓ కుటుంబంలోని పెద్ద పిల్లలు ఇంట్లో ఉన్న ఆక్వేరియం ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్నారు. అందులోని రంగుల చేపలను ఓ వలలోకి పట్టి ఆడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న వారి ఏడాది తమ్ముడు ఆ చేపలను చూస్తూ కేరింతలు కొడుతున్నాడు. సరిగ్గా అప్పుడే వలలోంచి ఓ చేప ఒక్కసారిగా బయటకు ఎగిరి, తెరిచి ఉన్న ఆ చిన్నారి నోటిలోకి దూరి గొంతులో ఇరుక్కుపోయింది.

దీంతో ఊపిరాడక బాలుడు ఇబ్బంది పడటంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక మహారాజా యశ్వంత్‌రావు ప్రభుత్వ ఆసుపత్రికి (MYH) తరలించారు. అక్కడి ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ యామినీ గుప్తా బాలుడిని పరీక్షించారు. "సుమారు మూడు అంగుళాల పొడవున్న ఆ చేప బాలుడి గొంతులో బతికే ఉంది. అది తీవ్రంగా కొట్టుకోవడంతో లోపల గాయాలయ్యాయి. లాలాజలంతో పాటు రక్తం కూడా బయటకు వచ్చింది" అని ఆమె తెలిపారు. వైద్య బృందం వెంటనే శస్త్రచికిత్స నిర్వహించి, చేపను బయటకు తీశారు. దీంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
Go Back to Shorts
Indore
Aquarium Fish
Madhya Pradesh
Child Accident
Fish in Throat
MYH Hospital
Dr Yamini Gupta
ENT Surgery
Infant Health

More Telugu News