ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం కుదేలైన నేపథ్యంలో, రైతులను, ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో కరవు తీవ్రతను అంచనా వేసేందుకు పర్యటించిన కేంద్ర అంతర మంత్రిత్వ శాఖల బృందం (ఐఎంసీటీ) బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న ఉపశమన చర్యలను సీఎం వారికి సమగ్రంగా వివరించారు.

రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను కేంద్ర బృందానికి వివరిస్తూ, "ఒకవైపు తీరప్రాంతం తుఫాన్లతో నష్టపోతుంటే, మరోవైపు రాయలసీమ, ఇతర ప్రాంతాలు ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరవు కోరల్లో చిక్కుకున్నాయి" అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది సాధారణం కంటే అత్యంత తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల ఖరీఫ్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. 

ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, సాగునీటితో పాటు తాగునీరు, పశుగ్రాసానికి కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. దేశంలోనే రెండో అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతంగా అనంతపురం జిల్లా నిలిచిన విషయాన్ని ఆయన బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 412 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించామని, పంట నష్టాలపై పూర్తిస్థాయి అంచనాలతో వారం రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వ్యవసాయానికి అండగా కీలక పథకాల విస్తరణ

కరవు పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ఉపాధిని, వ్యవసాయాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కొన్ని కీలక ప్రతిపాదనలు చేశారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి క్షేత్రస్థాయిలో మానవ వనరుల అవసరం ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో 'వీబీ జీ రామ్ జీ' పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచాలని కోరారు. ఈ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానించడం ద్వారా రైతులకు కూలీల కొరత తీరడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సూచించారు. 

కరవు కారణంగా రైతుల ఆదాయం పూర్తిగా పడిపోయిందని, గతంలో తీవ్ర కరవు వచ్చినప్పుడు రాయలసీమలో పది ఎకరాల రైతులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చి ఆదుకున్నామని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుతం అర్హులైన కరవు బాధిత కుటుంబాలకు 'డ్రాట్ కార్డులు' జారీ చేసే అంశాన్ని పరిశీలించి, కేంద్ర సహకారంతో నిత్యావసరాలను సబ్సిడీపై అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు, రైతుల వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు కేంద్రం తోడ్పాటునందించాలని కోరారు.

జల్ జీవన్ మిషన్‌తో శాశ్వత పరిష్కారం

వర్షాభావంతో భూగర్భ జలమట్టాలు ప్రమాదకరంగా పడిపోయాయని, కొత్తగా ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడటం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. కేవలం తాత్కాలిక నీటి సరఫరా చర్యలతో సరిపెట్టకుండా, శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇందుకోసం 'జల్ జీవన్ మిషన్' (జేజేఎం) పథకాన్ని మరింత విస్తరించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి, అనుసంధానం వంటి పనులకు కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. 

పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారాన్ని త్వరగా అందించడం అత్యవసరమని అన్నారు. బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో జాప్యం లేకుండా, వీలైనంత త్వరగా పరిహారం రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది రైతులకు తదుపరి పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని వివరించారు.

ఈనెల 2, 3 తేదీల్లో కేంద్ర బృందం రెండు టీమ్‌లుగా విడిపోయి కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక, తమ క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా 15 రోజుల్లో కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని ఐఎంసీటీ సభ్యులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించే సహాయంపై నిర్ణయం తీసుకోనుంది.