టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (SKN) చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందిపుచ్చుకుని, పేరు సంపాదించిన తర్వాత కొందరు తారలు అదే పరిశ్రమను విమర్శిస్తున్న తీరు సరికాదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఈ ధోరణి దురదృష్టకరమని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.

"ఒక పాత్రికేయుడిగా ఇండస్ట్రీని దగ్గర నుంచి గమనిస్తున్న నాకు ఈమధ్య ఒక విచారకరమైన ధోరణి కనిపిస్తోంది. దక్షిణాది సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమాలో అవకాశాలు అందుకోవడం, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలతో గుర్తింపు తెచ్చుకోవడం, ఆ తర్వాత కొన్నేళ్లకు ఇదే పరిశ్రమను, ఇక్కడి కథలను, సాంస్కృతిక సంప్రదాయాలను విమర్శించడం కొందరికి అలవాటుగా మారింది.

అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి నటుడికి/నటికి ఉంటుంది, కాదనను. కానీ, నిర్మాణాత్మక విమర్శకు, మనల్ని ఆదరించిన పరిశ్రమను సెలెక్టివ్‌గా చిన్నచూపు చూడటానికి మధ్య చాలా తేడా ఉంది. మన తెలుగు సినిమాకు, దక్షిణాది చిత్రసీమకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, కథలు చెప్పే పద్ధతి, విలువలు ఉన్నాయి. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారికి అది కొంచెం కొత్తగా, వింతగా అనిపించవచ్చు. కానీ, మన సంస్కృతిలో అది సర్వసాధారణం.

గౌరవం అనేది ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకోవాలి. ఇక్కడి అవకాశాలను ఆనందంగా స్వీకరించి, ఆ తర్వాత వాటి వెనుక ఉన్న సంస్కృతిని అగౌరవపరచడం సరికాదు. నిర్మాణాత్మక విమర్శలను ఎవరైనా స్వాగతిస్తారు. కానీ, ‘మాదే గొప్ప’ అనే సాంస్కృతిక ఆధిపత్య ధోరణితో కూడిన విమర్శలు మాత్రం ఆమోదయోగ్యం కాదు. మిమ్మల్ని గౌరవించిన పరిశ్రమను మీరు కూడా గౌరవించడం నేర్చుకోవాలి. ఇదే నేను చెప్పాలనుకున్నది" అని ఎస్కేఎన్ ట్వీట్ చేశారు.