కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌ను ఆశీర్వదించండి: మంత్రి కేటీఆర్
- విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు
- రేవంత్ రెడ్డి విద్యుత్ తీగలు పట్టుకుంటే కరెంట్ ఉందా? లేదా? తెలుస్తుందన్న కేటీఆర్
- తెలంగాణలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని వ్యాఖ్య
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని, ఈ ఎన్నికల్లో గెలిచాక కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రధాని మోదీకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలంగాణపై ప్రేమ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ధరణి ఎత్తేసి... పట్వారీ వ్యవస్థను తీసుకు రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. పట్వారీ వ్యవస్థ వద్దు... ధరణి ముద్దు అనేవారికి ఈసారి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. పట్వారీ వ్యవస్థను తీసుకువచ్చి మళ్లీ రైతులు, తెలంగాణ ప్రజల జీవితాలను ఆగం చేస్తారని కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు.
ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చే కేసీఆర్‌కు ఓటు వేసి... మూడోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకోం కదా అంటూ సామెత చెప్పారు. ధరణి తొంబై శాతం బాగుందని, ఆ పది శాతం కూడా సరి చేసుకుందామని చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలు మారిపోతాయన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉండే ప్రేమ రాహుల్ గాంధీ, మోదీలకు ఉంటాయా? అన్నారు. అలాంటి ఢిల్లీ వారిని నెత్తిమీద పెట్టుకుందామా? అని ప్రశ్నించారు. కామారెడ్డికి వస్తున్న కేసీఆర్‌ను ఆశీర్వదించాలని, అప్పుడు ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయన్నారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడన్నట్లుగా కేసీఆర్ మీ వద్దకు వచ్చాడన్నారు.