పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయం
- రేపు కేటీఆర్ పుట్టినరోజు
- విద్యార్థుల పోరాటం నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం
- రేపు ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు (జులై 24) తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ వీధుల్లో 'నీట్' పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు సంపూర్ణ సంఘీభావం తెలపడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఆడంబరాలకు స్వస్తి చెప్పి, విద్యార్థుల హక్కుల కోసం తాము కూడా నేరుగా పోరాటం చేస్తామని తెలిపారు.
దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద నీట్ అక్రమాలపై, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీఛార్జ్‌తో విరుచుకుపడటం తీవ్ర సంచలనం సృష్టించింది. విద్యార్థులు కూడా పలువురు పోలీసులపై దాడి చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ పోరాటానికి మద్దతుగా... హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) చేపట్టనున్న భారీ నిరసన కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా పాల్గొననున్నారు.