వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు.. అసలేం జరిగింది?
- ఇటీవల కర్నూలులో నిర్వహించిన ఓ ధర్నాలో పాల్గొన్న జక్కంపూడి రాజా
- స్థానికి సీఐ శేషయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజా
- జక్కంపూడిపై కేసు నమోదు చేయాలంటూ ఎస్సీ కమిషన్ ఆదేశాలు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చిక్కుల్లో పడ్డారు. కర్నూలు సీఐపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కర్నూలు పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే... ఇటీవల కర్నూలులో నిర్వహించిన ఒక ధర్నాలో పాల్గొన్న జక్కంపూడి రాజా స్థానిక సీఐ శేషయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు శేషయ్య తమ పార్టీ టికెట్ కోసం వచ్చారని, ఆయన కోట్ల డబ్బుతో ఎన్నికలకు సిద్ధమయ్యారని, అయితే అవినీతిపరులకు టికెట్ ఇవ్వబోమని ఆయనను గెంటేశామని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఒక వైసీపీ కార్యకర్తను సీఐ వేధించారని... తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ సీఐని తమ ఇంటి గేటు ముందే ఎండకి, వానకి నిలబెడతామని బహిరంగంగా హెచ్చరించారు.
జక్కంపూడి చేసిన ఈ వ్యాఖ్యలు తనను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని సీఐ శేషయ్య ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. పరిణామాలను, ఆడియో-వీడియో ఆధారాలను పరిశీలించిన ఎస్సీ కమిషన్... జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కర్నూలు త్రీటౌన్ పోలీసులు జక్కంపూడిపై కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపారు.