Advertisement

మూడ్‌ బాలేదా? ఈ చిన్న అలవాట్లు ట్రై చేయండి!

Mental Health tips for stress management and mood improvement
  • కాసేపు బయటకు వెళితే మనసుకు ప్రశాంతత
  • మనసులో ఉన్నది రాస్తే భారం దిగిపోతుందంటున్న నిపుణులు
  • శరీరాన్ని కదిలిస్తే మనసు ఉత్సాహంగా మారే ఛాన్స్‌
  • ఫోన్‌ స్క్రోల్‌ చేస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం
  • వాయిదా వేసిన పని పూర్తి చేసినా ప్రయోజనం
రోజంతా పనులు, డెడ్‌లైన్లు, కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో కారణాలతో మనసు భారంగా అనిపించడం సహజం. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపించే రోజులు ప్రతి ఒక్కరికీ వస్తుంటాయి. అలాంటి సమయంలో గంటల తరబడి విశ్రాంతి తీసుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ కేవలం 10-15 నిమిషాలు కేటాయించి కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

1. కాసేపు బయటకు వెళ్లండి
గదిలోనే గంటల తరబడి ఉండకుండా కాసేపు బయటకు వెళ్లండి. ఇంటి బాల్కనీ, ఆవరణ లేదా చెట్టు కింద ఐదు నుంచి పది నిమిషాలు గడిపినా సరిపోతుంది. చల్లటి గాలి, పక్షుల శబ్దం, ఆకాశం వైపు చూడటం వంటి చిన్న విషయాలు కూడా మనసును ప్రశాంతంగా మారుస్తాయి.

2. మనసులో ఉన్నదంతా రాసేయండి
ఆలోచనలు ఎక్కువై మనసు గందరగోళంగా ఉంటే ఒక నోట్‌బుక్‌ లేదా మొబైల్‌ నోట్స్‌లో మీ మనసులో ఉన్నదంతా రాసేయండి. వ్యాకరణం, క్రమం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఆలోచనల ఒత్తిడి తగ్గి సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి.

3. శరీరాన్ని కదిలించండి
జిమ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 10 నిమిషాలు వేగంగా నడవడం, మెట్లు ఎక్కడం, తేలికపాటి స్ట్రెచింగ్‌ చేయడం లేదా మీకు ఇష్టమైన పాటకు డ్యాన్స్‌ చేయడం కూడా సరిపోతుంది. దీంతో రక్తప్రసరణ మెరుగై శరీరం, మనసు రెండూ ఉత్సాహంగా మారతాయి.

4. ఫోన్‌కు కొద్దిసేపు దూరంగా ఉండండి
ఒత్తిడిగా ఉన్నప్పుడు సోషల్‌ మీడియా స్క్రోలింగ్‌ చేయడం పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. అందుకే 10-15 నిమిషాలు ఫోన్‌ను పక్కన పెట్టండి. ప్రశాంతంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం లేదా ఒక కప్పు టీ తాగడం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.

5. వాయిదా వేసిన పని పూర్తి చేయండి
ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న చిన్న పనిని పూర్తి చేయండి. ఒక మెయిల్‌కు రిప్లై ఇవ్వడం, టేబుల్‌ను సర్దడం, మంచం సర్దడం వంటి చిన్న పనులైనా పూర్తి చేస్తే, ఆ పనిని సాధించామన్న భావన కలిగి ఒత్తిడి తగ్గుతుంది.

చిన్న మార్పే.. పెద్ద ఉపశమనం
మూడ్‌ బాగోలేదని రోజంతా బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం 15 నిమిషాలు ఈ చిన్న అలవాట్లకు కేటాయిస్తే మనసు తేలికపడుతుంది. సమస్యలు వెంటనే మాయమవకపోయినా, వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యం మాత్రం పెరుగుతుంది.
Advertisement
Mental Health
Stress Relief Tips
Mood Improvement
Journaling
Digital Detox
Daily Wellness Habits

More Telugu News