Advertisement

ప్రమాదం కేసులో కొడుకు ఉంటే... తండ్రిని అరెస్ట్ చేస్తారా?: వరుదు కల్యాణి

Seediri Appalaraju arrest questioned by Varudu Kalyani over accident case
  • రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారన్న వరుదు కల్యాణి
  • చంద్రబాబు పాలన హిట్లర్, గడాఫీలను మించిపోయిందని విమర్శ
  • బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపాటు

మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.


చంద్రబాబు పాలన హిట్లర్, గడాఫీలను మించిపోయిందని... పోలీసు వ్యవస్థను తమ సొంత శాఖలా వాడుకుంటున్నారని విమర్శించారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో కుమారుడు ఉంటే, తండ్రిని అరెస్ట్ చేయడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి నమోదు చేయడాన్ని కోర్టు కూడా తప్పుపట్టడంతో మళ్లీ సెక్షన్లు మార్చారని, ఇది ప్రభుత్వ దివాలాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.


రాష్ట్రంలో వరుసగా బీసీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని కల్యాణి ఆరోపించారు. జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, రమేశ్ యాదవ్, సీదిరి అప్పలరాజు... ఇలా బీసీ నేతలను ఎదుగనీయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే బలహీన వర్గాలన్నీ ఏకమై ఈ ప్రభుత్వానికి గట్టి సమాధానం చెబుతాయని హెచ్చరించారు.


గుంటూరులో మహిళపై జరిగిన దారుణం, సినీనటి జత్వానీ కేసుల్లో ప్రభుత్వం తీవ్రంగా ఇరుక్కుపోవడంతో... ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ అరెస్టుల నాటకం ఆడుతున్నారని విమర్శించారు. విశాఖలో ఆరుగురు మత్స్యకారుల గల్లంతుపై సీదిరి అప్పలరాజు గట్టిగా నిలదీశారనే ఆయనపై కక్ష కట్టారని తెలిపారు. గతంలో కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభల వద్ద అమాయకులు చనిపోతే చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని, టీడీపీ నేతల పిల్లలు తప్పులు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నడుస్తున్న తీరు చూసి పారిశ్రామికవేత్తలు భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement
Seediri Appalaraju
Varudu Kalyani
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
BC Leaders

More Telugu News