Advertisement

ఆందోళన చేస్తే డ్రగ్స్ కేసు పెడతా.. విద్యార్థులను బెదిరించిన ముంబై పోలీస్!

Mumbai Police threatens students with fake drug cases for protesting
  • బెదిరింపులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • ఘటనపై విచారణకు ఆదేశించిన ముంబై పోలీసులు
  • వీడియోలో ఉన్న పోలీస్ డ్రైవర్‌పై బదిలీ వేటు
  • ఇది ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని విమర్శించిన కాంగ్రెస్
ముంబైలో నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులను ఓ పోలీస్ అధికారి బహిరంగంగా బెదిరించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆందోళనల్లో మళ్లీ కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

గత కొద్ది రోజులుగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో శివాజీ పార్క్, చెంబూర్, ఆజాద్ మైదాన్ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు, పౌరులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదుపులోకి తీసుకున్న విద్యార్థులను పోలీస్ వ్యానులో తరలిస్తుండగా, ఓ అధికారి వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వీడియోను ముంబై కాంగ్రెస్ తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

"మళ్లీ ఇక్కడ కనిపిస్తే మీ జీవితాలను నాశనం చేస్తా. మీ బ్యాగుల్లో 50 గ్రాముల పౌడర్ పెట్టి జైలుకు పంపిస్తా" అని సదరు అధికారి విద్యార్థులను హెచ్చరించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిరంతర నిరసనల కారణంగా తన విధి నిర్వహణ కష్టతరంగా మారిందని కూడా ఆయన ఆ వీడియోలో చెప్పడం గమనార్హం.

ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీస్ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యే వరకు సదరు అధికారిని ప్రస్తుత విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించింది. 

కాగా, ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడి అని అభివర్ణించింది. విద్యార్థుల అడిగే ప్రశ్నలకు బెదిరింపులతో కాకుండా, జవాబుదారీతనంతో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Advertisement
Mumbai Police
Mumbai Student Protest
Fake Drug Case Threat
Cockroach Janata Party

More Telugu News