రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు.. స్పందించిన కేంద్రం

India to Continue Oil Purchases from Russia Despite US Sanctions
  • అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు ఉంటాయని వెల్లడి
  • దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు ధరలు ఉంటాయని వెల్లడి
  • ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం
అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు కొనసాగుతాయని భారత్ స్పష్టం చేసింది. దేశీయ ఇంధన అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు దిగుమతులు ఉంటాయని తెలిపింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై అమెరికా ఆంక్షల మినహాయింపు గడువు ముగిసిన నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.

రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా భారత్ అక్కడి నుంచి కొనుగోలు చేసిందని తెలిపారు. ఆంక్షలను సడలించినప్పుడూ మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకున్నామని అన్నారు. ఇప్పుడు కూడా ఆ కొనుగోళ్ళు కొనసాగుతాయని తెలిపారు. చమురు ఏ దేశం నుంచి కొనాలనేది పూర్తిగా మన వాణిజ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

అందువల్ల అమెరికా ఆంక్షల సడలింపు ఉన్నా లేకపోయినా మనకు ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దేశంలో చమురు కొరత లేదని తెలిపారు. ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలకు అనుమతిస్తూ అమెరికా ఆంక్షలు సడలించిన విషయం తెలిసిందే.  అయితే ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే ఈ కొనుగోళ్ళు జరపాలని గతంలో తెలిపింది. ఆ గడువు మే 17తో ముగిసిన నేపథ్యంలో దేశంలో చమురు కొరతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో, కేంద్రం స్పందించింది.
Go Back to Shorts
India Russia oil
Russia oil imports
Sujata Sharma
Indian oil imports
Russia oil sanctions
America sanctions

More Telugu News