సెప్టెంబర్‌ 17న ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి: రాంచందర్‌రావు

సెప్టెంబర్‌ 17న ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి: రాంచందర్‌రావు

Ramchander Rao urges everyone to light lamps in every home on September 17
  • 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మోదీ
  • సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్న రాంచందర్ రావు
  • సెప్టెంబర్ 7న దీపాలు వెలిగించి మోదీకి శుభాకాంక్షలు తెలపాలని పిలుపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా మరింత చేరువ కావడం, అలాగే పార్టీ కార్యకర్తల్లో సేవా భావాన్ని పెంపొందించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

  

అభియాన్ ఆరంభ రోజైన సెప్టెంబర్‌ 17న ‘ఆశీర్వాద్‌ కా దియా’ పేరిట రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేయాలని రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.


మోదీ పాలనలో జన్‌ధన్ యోజన, డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా పేదలను నేరుగా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించి సంక్షేమ ఫలాలను పూర్తి పారదర్శకంగా అందిస్తున్నామని ఆయన తెలిపారు. యూపీఐ, డిజిటల్ చెల్లింపుల విప్లవంతో భారత్ ప్రపంచ డిజిటల్ పేమెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ముద్ర రుణాల ద్వారా చేతివృత్తిదారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఆర్థిక చేయూతనిస్తున్నామని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే 'మేరే సప్నో కా భారత్‌', 'సేవా కీ కహానీ', 'సేవా జ్యోతి కలశ్‌ యాత్ర', 'సుశాసన్‌ సేవా సంవాద్‌' వంటి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, మోదీ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేస్తామని పేర్కొన్నారు.

Advertisement
Ramchander Rao
Seva Sankalp Abhiyan
Narendra Modi
Telangana BJP
Aashirwad Ka Diya
PM Modi public service

More Telugu News