Bandi Sanjay: నీళ్లివ్వమని అడిగిన రైతులను జైల్లో పెట్టడం ఏమిటి?: బండి సంజయ్
- రంగనాయక్ సాగర్ పనులను వెంటనే పూర్తి చేయాలని బండి సంజయ్ డిమాండ్
- పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని విమర్శ
- పనులు పూర్తయి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరు అందేదని వ్యాఖ్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సాగునీటి కాలువ పనుల కోసం ఆందోళన బాట పట్టిన రైతులను పోలీసులు అరెస్టు చేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. తమ పొలాలకు నీళ్లివ్వమని అడిగిన రైతులను జైల్లో పెట్టడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుంచి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలాలకు సాగునీరు అందించే 11వ ప్యాకేజీ (ఎల్ఎం 4, ఎల్ఎం 6) కాలువ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కాలువ పనుల కోసం రూ. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా, ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై బండి సంజయ్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ పనులు గనుక పూర్తయి ఉంటే దాదాపు 9,500 ఎకరాలకు సాగునీరు అందేదని ఆయన అన్నారు. గత పదేళ్లు అధికారంలో ఉండి కూడా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ ఒక 'రైతు ద్రోహి' అని ఆయన ఘాటుగా విమర్శించారు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ వైఫల్యాల వల్లే రైతులు పంటలు నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు మద్దతుగా నిలిచిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. రైతులపై అక్రమ కేసులు నమోదు చేస్తే ఊరుకునేది లేదని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని హెచ్చరించారు. రైతుల డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ అండగా ఉంటుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి కాలువ పనులు ప్రారంభించకపోతే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.