Shivam Dube: ఆఖరి ఓవర్లో దూబే శివతాండవం... టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ కొండంత స్కోరు

Shivam Dubes Storm in Final Over India Scores Big in T20 World Cup
  • అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరు
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టి 255 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్
  • ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శివమ్ దూబే మెరుపు దాడి
  • అదరగొట్టిన సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ చివర్లో, ఆఖరి ఓవర్లలో భారత బ్యాటర్ శివమ్ దూబే సృష్టించిన విధ్వంసం టీమిండియా అభిమానులను అలరించింది. స్లాగ్ ఓవర్లలో పరుగులు వేగం తగ్గిందనుకున్న దశలో... కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డ దూబే, భారత స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 8 బంతులు మాత్రమే ఎదుర్కొన్న దూబే.. 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో ఏకంగా 26 పరుగులు రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ (8 నాటౌట్) నిలవడంతో, నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. చివరి ఓవర్లో దూబే చేసిన హిట్టింగ్ భారత శిబిరంలో ఫైనల్ జోష్‌ను నింపింది. జిమ్మీ నీషామ్ విసిరిన ఆ ఓవర్లో దూబే 2 సిక్సులు, 3 ఫోర్లతో 24 పరుగులు సాధించాడు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు కళ్ళు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ కివీస్ బౌలర్లను ఆడుకున్నారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 పరుగులు చేసి మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. పవర్ ప్లేలో వీరిద్దరూ పోటీపడి పరుగులు చేయడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ క్లాస్, మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. అభిషేక్ ఔటయ్యాక వచ్చిన ఇషాన్ కిషన్ (54 పరుగులు, 25 బంతుల్లో) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది.

అయితే, ఇన్నింగ్స్ 15, 16 ఓవర్ల మధ్యలో న్యూజిలాండ్ బౌలర్ జేమ్స్ నీషమ్ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు. వరుస విరామాల్లో కుదురుకున్న సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లను పెవిలియన్ చేర్చడమే కాకుండా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను డకౌట్ చేసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ దశలో స్కోరు వేగం తగ్గుతుందేమో అనిపించినా.. హార్దిక్ పాండ్యా (18) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. చివరలో శివమ్ దూబే తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి కివీస్ బౌలర్ల ఆశలపై నీళ్లు చల్లాడు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్స్ నీషమ్ 3 వికెట్లు తీయగా, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ దక్కించుకున్నారు. వరల్డ్ కప్ గెలవాలంటే న్యూజిలాండ్ ఇప్పుడు 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.


Shivam Dube
T20 World Cup
India vs New Zealand
T20 World Cup Final
Abhishek Sharma
Sanju Samson
Ishan Kishan
James Neesham
Cricket
Ahmedabad

More Telugu News