ప్రియాంక 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్య.. భగ్గుమన్న 200 మంది విద్యావేత్తలు

Priyanka Gandhi Gomutra expert remark 200 academics condemn comments
  • 'గోమూత్ర నిపుణుడు' అనడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యావేత్తలు
  • 215 మంది సంతకాలతో బహిరంగ లేఖ విడుదల
  • ఇది శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీయడమేనని లేఖలో ఆందోళన
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశించి ఆమె "గోమూత్ర నిపుణుడు" అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతూ 200 మందికి పైగా ప్రముఖులు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

మంగళవారం లోక్‌సభలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026'పై జరిగిన చర్చలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల సంస్కరణల నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ సభ్యుల నియామకాన్ని ప్రశ్నిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగంలో ఆమె ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆ విమర్శలు కమిటీ సభ్యుడైన ప్రొఫెసర్ కామకోటిని ఉద్దేశించినవేనని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో 215 మంది వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్లు, విద్యావేత్తలు సంతకాలు చేసిన లేఖలో ప్రియాంక తీరును తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శల కోసం ఒక ప్రముఖ శాస్త్రవేత్తను కించపరిచేలా మాట్లాడటం సరికాదని, ఇటువంటి ధోరణి రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ కామకోటి ఐఐటీ మద్రాస్‌లోనే పీహెచ్‌డీ పూర్తి చేశారని, 150కి పైగా పరిశోధన పత్రాలను సమర్పించారని, డీఆర్‌డీఓ అకడమిక్ ఎక్సలెన్స్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. భారత్ తొలి ఇండస్ట్రీ-గ్రేడ్ మైక్రోప్రాసెసర్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన గొప్ప సాంకేతిక నిపుణుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమని వారు హితవు పలికారు. పార్లమెంట్ చర్చలు గౌరవప్రదంగా, హుందాగా జరగాలని వారు సూచించారు.
Advertisement
Priyanka Gandhi Vadra
Prof V Kamakoti
IIT Madras Director
Gomutra Expert Remark
Academics Open Letter
Lok Sabha Debate

More Telugu News