ఒరిజినల్ డాక్యుమెంట్లు గల్లంతు.. ఎస్బీఐకి వినియోగదారుల కమిషన్ భారీ షాక్

State Bank of India loses original documents Consumer Commission imposes heavy fine
  • కస్టమర్‌కు చెందిన ఆస్తి పత్రాలు పోగొట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • బాధితుడికి రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించిన వినియోగదారుల కమిషన్
  • హోం లోన్ గ్యారంటీగా పెట్టిన డాక్యుమెంట్లు గల్లంతు కావడంతో వివాదం
  • ఎస్బీఐ వాదనలను తోసిపుచ్చి, బ్యాంకు నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన ఫోరం
ఖాతాదారుడికి చెందిన కీలకమైన ఆస్తి పత్రాలను పోగొట్టిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)పై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన బాధితుడికి రూ. 3 లక్షల నష్టపరిహారంతో పాటు, వ్యాజ్యం ఖర్చుల నిమిత్తం మరో రూ. 20,000 చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

ఇబ్రహీంపట్నం పరిధిలోని బొంగులూరుకు చెందిన బి. వెంకటేశం, ఎస్బీఐ ఆదిభట్ల బ్రాంచ్‌లో రూ. 5 లక్షల గృహ రుణం తీసుకున్నారు. ఈ రుణానికి అదనపు హామీగా తన బంధువు అంజయ్యకు చెందిన 194 చదరపు గజాల ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్, ఇతర లింక్ డాక్యుమెంట్లను బ్యాంకులో సమర్పించారు. మార్చి 2022లో వెంకటేశం రుణం మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించి, బ్యాంకు నుంచి నో-డ్యూస్ సర్టిఫికేట్ కూడా పొందారు.

అనంతరం తన పత్రాలను తిరిగి ఇవ్వాలని ఆయన బ్యాంకును కోరగా, అధికారులు తొలుత పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. సెంట్రలైజేషన్ ప్రక్రియ జరుగుతోందని, 15 రోజుల్లో ఇస్తామని కాలయాపన చేశారు. ఆ తర్వాత అసలు పత్రాలు కనిపించడం లేదని బ్యాంకు వర్గాలు సమాధానం ఇవ్వడంతో బాధితుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. దాదాపు రెండేళ్లపాటు బ్యాంకు చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం, బ్యాంకు యాజమాన్యం కేవలం ధ్రువీకృత నకళ్లు (సర్టిఫైడ్ కాపీలు) మాత్రమే ఇవ్వడంతో ఆయన న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ కేసు విచారణ సందర్భంగా, తమ వైపు సేవల లోపం లేదని, పత్రాల అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రత్యామ్నాయ పత్రాల కోసం పత్రికా ప్రకటన కూడా ఇచ్చామని ఎస్బీఐ వాదించింది. అయితే, బ్యాంకు వాదనలను కమిషన్ తోసిపుచ్చింది. రుణం వెంకటేశం పేరు మీద ఉందని, పత్రాల భద్రతలో బ్యాంకు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటూ, బాధితుడికి తగిన నష్టపరిహారం చెల్లించాలని ఎస్బీఐని ఆదేశించింది.
Advertisement
State Bank of India
Rangareddy Consumer Commission
Lost Property Documents
SBI Home Loan Compensation

More Telugu News