దేశంలో అడుగు పెట్టిన వెంటనే హసీనాను అరెస్ట్‌ చేస్తాం.. బంగ్లా మంత్రి హెచ్చరిక!

Sheikh Hasina will be arrested immediately upon entering the country warns Bangladesh Minister
  • డిసెంబర్‌లో స్వదేశానికి వెళతానన్న హసీనా
  • కోర్టులో లొంగే అవకాశం ఉండకపోవచ్చన్న ఆ దేశ మంత్రి
  • హసీనా పాస్‌పోర్టు ఇప్పటికే రద్దు
  • 2025లో మరణశిక్ష విధించిన ట్రైబ్యునల్‌
స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ప్రకటించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరి వెల్లడించింది. దేశంలో అడుగుపెట్టిన క్షణమే ఆమెను అరెస్ట్‌ చేస్తామని ఆ దేశ న్యాయశాఖ మంత్రి ఎం.అసదుజ్జమాన్‌ స్పష్టం చేశారు. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొన్నారు.

ఫ్రాన్స్‌కు చెందిన వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్‌ హసీనా ఈ ఏడాది డిసెంబర్‌లోగా స్వదేశానికి తిరిగి వెళ్తానని చెప్పారు. తనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని, హత్య కూడా చేయొచ్చని తెలుసని, అయినా ప్రజలు పిలుస్తున్నందున తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. గత నెలలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా బంగ్లాదేశ్‌కు వెళతానని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన న్యాయశాఖ మంత్రి, మరణశిక్ష పడిన వ్యక్తిగా హసీనాకు కోర్టులో నేరుగా లొంగిపోయే అవకాశం కూడా దక్కకపోవచ్చని అన్నారు. ఆమె బంగ్లాదేశ్‌ పౌరురాలిగా స్వదేశానికి వచ్చే హక్కు ఉన్నా, దేశంలోకి ప్రవేశించిన వెంటనే చట్ట ప్రకారం అరెస్ట్‌ చేస్తామని చెప్పారు.

మధ్యంతర ప్రభుత్వం ఇప్పటికే షేక్‌ హసీనా పాస్‌పోర్టును రద్దు చేసింది. అలాంటప్పుడు ఆమె ఎలా వస్తారన్న ప్రశ్నకు అది ఆమె సమస్యని మంత్రి వ్యాఖ్యానించారు. ఆమె ఎలాంటి మార్గంలో దేశంలోకి వచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు.

2024లో విద్యార్థుల ఉద్యమం తర్వాత హసీనా ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె భారత్‌లో రహస్య ప్రాంతంలో ఉంటున్నారు. 2025లో బంగ్లాదేశ్‌ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్‌ ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణించారు. మరోవైపు, ఈ విచారణలో న్యాయపరమైన లోపాలున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు విమర్శించాయి. హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్‌ చేసిన అభ్యర్థన ప్రస్తుతం పరిశీలనలో ఉందని భారత్‌ తెలిపింది.
Advertisement
Sheikh Hasina
Bangladesh Law Minister
Asaduzzaman
Bangladesh Political News
Sheikh Hasina Arrest Warning
India Bangladesh Relations

More Telugu News