Bandi Sanjay: పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో పడగొడతాం: కాంగ్రెస్ సర్కార్‌కు బండి సంజయ్ వార్నింగ్

Bandi Sanjay Warns Congress Government Over House Demolitions
  • గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారన్న బండి సంజయ్
  • తాము అధికారంలోకి వచ్చాక పెద్దల ఇళ్లను కూల్చివేస్తామని హెచ్చరిక
  • మూటల కోసమే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని విమర్శ

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం పేదల ఇళ్లను కూల్చివేయడంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ సాకుతో సామాన్యుల ఇళ్లను కూలిస్తే, తాము అధికారంలోకి వచ్చాక పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని హెచ్చరించారు. గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే సాకుతో వందలాది కుటుంబాలను రోడ్డున పడేయడం గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధమని మండిపడ్డారు. గతంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన కాలేజీల కూల్చివేత విషయంలో విద్యార్థుల పరీక్షలను సాకుగా చూపిన ప్రభుత్వం... ఇప్పుడు ఖమ్మంలో కూల్చివేతలు చేస్తున్నప్పుడు ఇంటర్ విద్యార్థుల పరీక్షలు, భవిష్యత్తు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.


ఒవైసీని ప్రసన్నం చేసుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. హిందువులను జైల్లో వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని, దీనికి ప్రజలంతా ఏకమై బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులు బయట తిరగలేరని, ఇప్పటికే ఆ పార్టీలో అంతర్యుద్ధం మొదలైందని ఎద్దేవా చేశారు. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ... ఆయన కేవలం 'మూటల' కోసమే రాష్ట్రానికి వచ్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలన గాలికి వదిలేసి, ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల పక్షాన బీజేపీ పోరాటం ఆగదని, అవసరమైతే బుల్డోజర్లతోనే సమాధానం చెబుతామని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay
Moosi River
Gandhi Statue
Telangana Congress
AIMIM
Asaduddin Owaisi
House Demolitions
Rahul Gandhi
BJP Protest
Political Controversy

More Telugu News