Donald Trump: ట్రంప్ విధించిన సుంకాలకు బ్రేక్.. రేప‌టి నుంచి నిలిచిపోనున్న వసూళ్లు

Trump Era Tariffs Halted in US Following Court Ruling
  • ట్రంప్ విధించిన కొన్ని దిగుమతి సుంకాలను చట్టవిరుద్ధమన్న సుప్రీంకోర్టు 
  • దీంతో ఆ సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం వెల్లడి
  • ఈ తీర్పు రాగానే ట్రంప్ మరో చట్టం కింద కొత్తగా 15శాతం సుంకాల‌ ప్రకటన‌
  • చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలపై ప్రభావం చూపనున్న తీర్పు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల వసూళ్లు ఆగిపోతాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన టారిఫ్ కోడ్‌లను తమ కార్గో సిస్టమ్స్‌లో డియాక్టివేట్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను దిగుమతిదారులకు తిరిగి చెల్లిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉపయోగించి ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు స్ప‌ష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే ట్రంప్ మరో ఎత్తుగడ వేశారు. మరో చట్టంలోని సెక్షన్ 122 కింద అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై కొత్తగా 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు.

రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు తీర్పుతో అమెరికా ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు వసూలు చేసిన 175 బిలియన్ డాలర్లకు పైగా సుంకాలను తిరిగి చెల్లించాల్సి రావొచ్చని అంచనా. ఈ తీర్పుతో చైనా, దక్షిణ కొరియా, జపాన్, తైవాన్ వంటి ప్రధాన ఎగుమతి దేశాలకు ఊరట లభించింది. అయితే, జాతీయ భద్రత, అన్యాయమైన వాణిజ్యం వంటి కారణాలతో ట్రంప్ విధించిన ఇతర సుంకాలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.


Donald Trump
US Tariffs
United States
Import duties
Supreme Court
Trade war
Global trade
Tariff codes
US Customs
Trade

More Telugu News