సిమ్‌ కార్డు విషయంలో కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా

సిమ్‌ కార్డు విషయంలో కీలక హెచ్చరిక.. మూడేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా

SIM card warning three years jail and 50 lakh fine
  • అనుమతి లేకుండా గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్‌ తీసుకుంటే కఠిన శిక్ష
  • ఐఎంఈఐలో మార్పులు చేయడం కూడా తీవ్ర నేరమేన్న డీఓటీ
  • ఛత్తీస్‌గఢ్‌లో 25 సిమ్‌ల అక్రమ యాక్టివేషన్‌
  • పీఓఎస్‌ ఏజెంట్‌ను శాశ్వతంగా బ్లాక్‌ చేసిన అధికారులు
సిమ్‌ కార్డుల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇతరుల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి సిమ్‌ తీసుకోవడం, టెలికాం గుర్తింపులను దుర్వినియోగం చేయడం, ఐఎంఈఐ నంబర్లలో అక్రమంగా మార్పులు చేయడం తీవ్ర నేరాలుగా పరిగణిస్తామని టెలికమ్యూనికేషన్స్‌ శాఖ (డీఓటీ) తెలిపింది. ఇలాంటి నేరాలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన ఓ మోసం నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసింది. అక్కడ ఓ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) ఏజెంట్‌.. ప్రజలకు తెలియకుండా వారి గుర్తింపు పత్రాలతో 25 సిమ్‌ కార్డులను యాక్టివేట్‌ చేసినట్లు గుర్తించారు.

విషయం బయటపడిన వెంటనే టెలికమ్యూనికేషన్స్‌ శాఖ, మొబైల్‌ సేవల సంస్థలతో కలిసి చర్యలు చేపట్టింది. సంబంధిత పీఓఎస్‌ ఏజెంట్‌ను బ్లాక్‌ చేసింది. ఇకపై అతడి దుకాణం నుంచి కొత్త మొబైల్‌ కనెక్షన్లు జారీ చేయకుండా శాశ్వతంగా నిషేధించింది.

ఆ 25 మొబైల్‌ నంబర్లను డిజిటల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ (డీఐపీ) ద్వారా పరిశీలించారు. అనుమానాస్పదంగా ఉన్న కనెక్షన్లకు మళ్లీ ధ్రువీకరణ చేపట్టారు. సరైన ధ్రువీకరణ ఇవ్వని సిమ్‌లను డీయాక్టివేట్‌ చేశారు.

సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డీఓటీ ఈ హెచ్చరిక చేసింది. ప్రజల గుర్తింపు పత్రాలను వారి అనుమతి లేకుండా ఉపయోగించి సిమ్‌ తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
Advertisement
Department of Telecommunications
SIM card fraud
Telecom identity misuse
IMEI tampering punishment
Cyber crime prevention
SIM card rules India

More Telugu News