రాయలసీమలో అద్భుతం.. గణపయ్య కోసం కదిలొచ్చిన గంగమ్మ!

రాయలసీమలో అద్భుతం.. గణపయ్య కోసం కదిలొచ్చిన గంగమ్మ!

Rayalaseema miracle as rains fill ponds for Ganesha immersion
  • వినాయక నిమజ్జనానికి నీళ్లు లేని రాయలసీమలో భారీ వర్షాలు
  • ఎండిన చెరువుల్లో వదిలిన విగ్రహాలు నీటిలో మునక
  • గణపయ్యను గంగమ్మే ఒడిలోకి చేర్చుకుందంటున్న నెటిజన్లు
  • అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
  • ఖరీఫ్‌లో ఇదే అతిపెద్ద వర్షం.. రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం
రాయలసీమలో ప్రకృతి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. మొన్నటిదాకా ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక అల్లాడిపోయిన సీమ జిల్లాలను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వినాయక నిమజ్జనానికి నీళ్లు లేక ప్రజలు ఎండిపోయిన చెరువుల్లో వదిలివెళ్లిన గణనాథులను.. ఇప్పుడు అవే చెరువుల్లోకి వచ్చి చేరిన నీరు ముంచెత్తుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ గణనాథుడి కష్టాలు చూసి గంగమ్మే కదిలివచ్చిందంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించిన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల చేసేదేమీ లేక ఎండిపోయిన చెరువు గర్భంలోనే విగ్రహాలను వదిలేసి వెళ్లారు. ఈ దృశ్యాలు చూసి చాలామంది ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, నాలుగైదు రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో మొన్నటిదాకా బీడువారిన చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది.

ఎండిన చెరువుల్లో వదిలేసిన వినాయక విగ్రహాలు.. ఇప్పుడు వర్షపు నీటిలో నెమ్మదిగా మునుగుతున్న వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. "గణనాథుడిని సాగనంపేందుకు నీళ్లు లేవని బాధపడ్డాం.. కానీ ఆయన్ను తన ఒడిలోకి చేర్చుకునేందుకు గంగమ్మే స్వయంగా తరలివచ్చింది" అంటూ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ వర్షాలు ఖరీఫ్ సీజన్‌లో పండ్ల తోటల రైతులకు గొప్ప ఊరటనిచ్చాయని, ఇదే ఈ సీజన్‌లో అతిపెద్ద వర్షమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి కరువుతో అల్లాడిన సీమలో ఈ వర్షాలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి.
Advertisement
Rayalaseema
Ganesha Immersion
Anantapur Rains
Kurnool Rainfall
Nandyal Weather
Andhra Pradesh Rains

More Telugu News