కారుమూరిని కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు.. చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలింపు

కారుమూరిని కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు.. చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలింపు

ED takes Karumuri into custody shifted from Chanchalguda Jail to ED office
  • ఏపీ మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు
  • ప్రభుత్వ ఖజానాకు రూ. 195.33 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఈడీ గుర్తింపు
  • ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు కూడా అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా టెండర్లలో చోటుచేసుకున్న భారీ అక్రమాల కేసు విచారణలో భాగంగా వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర జైలు నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి ఆయనను తరలించారు. నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అనుమతితో రెండు రోజుల పాటు ఆయనను విచారించనున్నారు.

  

ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 195.33 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక విచారణలో ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల సవరణలు చేయడం, డమ్మీ సబ్-కాంట్రాక్టర్లను పెట్టి భారీగా నిధుల మళ్లింపులు జరిపారన్న ఆరోపణలపై పీఎంఎల్ఏ చట్టం కింద కారుమూరితో పాటు ఆయన కుమారుడు సునీల్ కుమార్‌ను కూడా అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 


న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్‌లో భాగంగా చంచల్‌గూడ జైలులో ఉన్న కారుమూరిని కస్టడీకి కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అందుకు అనుమతించింది. రెండు రోజుల కస్టడీ విచారణలో అక్రమ నగదు లావాదేవీల అసలు నెట్‌వర్క్, నిధుల తుది చేరికపై మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు అధికారులు విచారణను తీవ్రతరం చేశారు. 

Advertisement
Karumuri Nageswara Rao
Enforcement Directorate
AP Liquor Scam
Chanchalguda Jail
YSRCP Leader
PMLA Court Hyderabad

More Telugu News