దళిత ముఖ్యమంత్రిపై ప్రకటన చేస్తావా? లేక, ఎన్నికల కోసం డ్రామాలని ఒప్పుకుంటావా?: కేసీఆర్ ను నిలదీసిన షర్మిల
- కేసీఆర్ నోట మళ్లీ దళిత ముఖ్యమంత్రి మాట వచ్చిందని, ఇది కొత్త కుట్రకు నిదర్శనమన్న షర్మిల
- దళిత వ్యక్తి పక్కన కూర్చుంటే పక్కకు నెట్టిన నీచ సంస్కృతి కేసీఅర్‌ది అని మండిపాటు
- అవసరం వచ్చినప్పుడు దళిత సీఎం అంటే నమ్మే రోజులు లేవన్న షర్మిల
దళిత వ్యక్తి పక్కన కూర్చుంటే పక్కకు నెట్టిన నీచ సంస్కృతి దొర కేసీఅర్‌ది అన్నారు. పాలనలో సంక్షేమాన్ని తుంగలో తొక్కి... మూడెకరాల భూమి నుంచి దళిత బంధు వరకు... డబుల్ బెడ్ రూం ఇళ్ల నుంచి కార్పొరేషన్ రుణాల దాకా అన్నింటా మోసాలే అన్నారు. పదేళ్ల పాలనలో దళితులపై లాఠీలు ఝళిపించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. దళిత మహిళలను లాకప్ డెత్ చేయించిన నియంత పాలన కేసీఆర్‌దే అన్నారు. అసెంబ్లీ వేదికగా దళిత ముఖ్యమంత్రి పై మాట మార్చిన దొర గారు... సమయం వచ్చినప్పుడు దళితుడిని సీఎం చేస్తానని చెప్పడం కొత్త కుట్రకు నిదర్శనమన్నారు.
నిజంగా దళిత బిడ్డను ముఖ్యమంత్రిని చేయడానికి ఇప్పుడు సమయం లేదా? అర్హతలు ఉన్న దళిత నాయకులు లేరా? లేక మీ తాలిబాన్ పాలనలో అసలు దళితులకు రాజ్యాధికారం వద్దా? అని ప్రశ్నించారు. ఒకవైపు కొడుకును సీఎం చేసేందుకు మోదీతో తెరచాటు ఒప్పందాలు చేసుకుంటూ.. అవసరం వచ్చినప్పుడు దళిత సీఎం అంటే నమ్మే రోజులు పోయాయన్నారు. దమ్ముంటే... దళితులపై నిజంగా ప్రేమ ఉంటే... ఎన్నికల ముందే దళిత ముఖ్యమంత్రిపై ప్రకటన చేయాలని సవాల్ చేశారు. లేదంటే ఈ డ్రామాలన్నీ ఎన్నికల కోసమే అని ఒప్పుకోవాలన్నారు.