ఎల్‌నినో ఎఫెక్ట్.. ప్రతి వర్షపు చుక్కనూ కాపాడుకుందాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ఎల్‌నినో కారణంగా తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న పొన్నం
- అధికారులకు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- ఆరుతడి పంటలు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచన
ఎల్‌నినో ప్రభావం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణంలో తలెత్తిన ఈ మార్పుల దృష్ట్యా ప్రజలకు, రైతులకు నీటి ఎద్దడి రాకుండా అధికారులు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఐఓసీ కార్యాలయంలో ఎల్‌నినో ప్రభావం, తాగునీటి పరిస్థితులపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తాగునీటి కొరతతో పాటు పశువులకు గ్రాసం లభించక ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని అధికారులను హెచ్చరించారు. రాబోయే జూన్ నెల వరకు వర్షాలు పడే అవకాశం తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని వెల్లడించారు. ఈ కరవు పరిస్థితులను తట్టుకోవాలంటే రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు వేసేలా అధికారులు వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు.
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలమట్టాలను మళ్లీ పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేయాలని పొన్నం తెలిపారు. 'వీబీజీ రాంజీ' ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుని ప్రతి ఊరిలో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టాలని, పడిన ప్రతి వర్షపు బొట్టునూ వృథా కాకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతూ నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.