ముస్లిం సమాజానికి... హిందూ యువతకు బండి సంజయ్ విజ్ఞప్తి
- బీజేపీ సభకు వచ్చిన జనాన్ని చూసి కేసీఆర్ గుండె పగిలిపోతుందన్న బండి సంజయ్
- బీజేపీ అధికారంలోకి వస్తే ముథోల్‌ను దత్తత తీసుకుంటానని హామీ
- కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిందని వ్యాఖ్య
- ఓట్ల కోసమే టోపీ పెట్టుకొని వచ్చి మోసం చేస్తున్నారని ముస్లిం సమాజం గుర్తించాలని విజ్ఞప్తి
- హిందూ యువత ఓటు బ్యాంకుగా మారాలన్న బండి సంజయ్
ముథోల్ టెక్స్ టైల్ పార్క్, పీజీ కాలేజీ, ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణాలకు కృషి చేస్తానన్నారు. గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాల ద్వారా ముథోల్ నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామన్నారు. పెండింగులో ఉన్న సుద్ధ వాగు ప్రాజెక్టు కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. బైంసాను మైసాగా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ వాస్తవానికి ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చెల్లని రూపాయి అన్నారు. వందలాది మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. డిసెంబర్ 4వ తేదీన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావడం తప్పదన్నారు.
రామారావు పటేల్ గెలిచాక మళ్లీ ముథోల్ వస్తానని, ఇచ్చిన మాట ప్రకారం దత్తత తీసుకుంటానని, బైంసాను మైసాగా మారుస్తానని స్పష్టం చేశారు. బైంసాలో మజ్లిస్ గూండాల అరాచకాలు తన కళ్లముందు మెదులుతున్నాయన్నారు. బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. పన్నెండు శాతం ఓట్ల కోసం బీఆర్ఎస్ ముస్లింలను నమ్ముకుంటే, కాంగ్రెస్ ముస్లిం మతపెద్దలను నమ్ముకుందని ఆరోపించారు. బైంసాలో నా హిందూ తమ్ముళ్లను మజ్లిస్ పార్టీ ఏ విధంగా హింసించిందో.. ఆ ఘటనలు మరువలేనన్నారు. దేవాదాయ శాఖ మంత్రి దేవుడిమాన్యాలు చెరబడుతూ ఓ వర్గం ఓట్ల కోసం ఈద్గాకు భూములను ధారాదత్తం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే దాచిపెట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. బాసర సరస్వతీ అమ్మవారికి రూపాయి ఇవ్వలేదన్నారు. ముస్లిం సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నానని.. ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారని, టోపీలు పెట్టుకొని నమాజ్ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో మతకల్లోలాలు లేవన్నారు. హిందూ యువకులు కూడా ఓటు బ్యాంకుగా మారాలని విజ్ఞప్తి చేశారు.