Advertisement

తిరుమలను రాజకీయం చేయొద్దు: వైసీపీపై భాను ప్రకాశ్ రెడ్డి ధ్వజం

Bhanu Prakash Reddy warns YCP not to politicize Tirumala
  • సనాతన ధర్మాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవద్దన్న భానుప్రకాశ్ రెడ్డి
  • వైసీపీ హయాంలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగాయని మండిపాటు
  • ఏ అంశంపై అయినా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను రాజకీయావసరాలకు వేదికగా మార్చవద్దని టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని, ఆలయ వ్యవహారాలను తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని వైసీపీ నేతలకు గట్టి హితవు పలికారు. ఢిల్లీ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తిరుమల ఘాట్ రోడ్డులో చోరీకి గురైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని పోలీసులు 24 గంటల్లోనే రికవరీ చేశారని, వెంటనే దాన్ని పునఃప్రతిష్ఠించామని తెలిపారు.


గత వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయని భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కానీ, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేవాలయాల పరిపాలన అత్యంత పారదర్శకంగా, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా సాగుతోందని వెల్లడించారు. తిరుమల టీటీడీ నిధుల మళ్లింపుపై ప్రశ్నిస్తూ, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడేముందు తగిన ఆధారాలతో మాట్లాడాలని సవాల్ విసిరారు.


ఆలయ పాలన లేదా మరే ఇతర అంశంపై అయినా తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే ధ్యేయంగా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని ఆయన ఈ సందర్భంగా వైసీపీ నాయకులకు హితవు పలికారు.

Advertisement
Bhanu Prakash Reddy
Tirumala Tirupati Devasthanams
YSRCP
Bhumana Karunakar Reddy
TTD Board news
Andhra Pradesh temple politics

More Telugu News