మేం అమాయకులమా?: చిదంబరం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి హరీశ్ రావు
- తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తీసుకున్నదే చిదంబరమని తీవ్ర ఆగ్రహం
- పొట్టి శ్రీరాములు త్యాగం గురించి మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని వ్యాఖ్య
- మద్రాస్ రాష్ట్రం ఉండేదని... తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం చెప్పడం హాస్యాస్పదమన్న హరీశ్ రావు
అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహిస్తే మంచిదన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిదన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు.
కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం కాదు... పదకొండుసార్లు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ సాధించింది కేసీఆర్ అన్నారు. సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆరే అన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు దీవించబోతున్నారన్నారు.