మయన్మార్‌లో హిందువులను ఊచకోత కోసిన రోహింగ్యా ముస్లింలు
- 53 మంది హిందువుల ఊచకోత
- మృతుల్లో అత్యధికులు చిన్నారులే
- తాజా నివేదికలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడి
రోహింగ్యాల దాడులతో మిలటరీ రంగంలోకి దిగడంతో తట్టుకోలేక దాదాపు 7 లక్షల మంది రోహింగ్యాలు దేశం విడిచిపెట్టి సరిహద్దు దేశాలకు పారిపోయారు. ఆర్మీ చర్య రోహింగ్యా జాతి ప్రక్షాళనకు కారణమైందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
తమపై జరుగుతున్న దాడులకు ఆగ్రహంతో ఊగిపోయిన రోహింగ్యాలు హిందువులు నివసిస్తున్న ఉత్తర రఖినెలోని గ్రామాలపై దాడులు చేసి వారిని ఊచకోత కోశారని అమ్నెస్టీ వెల్లడించింది. హిందువులు ఊచకోతకు గురైన ప్రాంతానికి గతేడాది సెప్టెంబరులో రిపోర్టర్లను తీసుకెళ్లిన మిలటరీ.. రోహింగ్యాల దుశ్చర్యను ప్రపంచానికి చూపించింది. అయితే, అది తమ పని కాదని అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ (ఏఆర్ఆర్ఎస్ఏ) అప్పట్లో ప్రకటించింది.
తాజాగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఓ నివేదిక విడుదల చేస్తూ.. 53 మంది హిందువులను రోహింగ్యాలు ఊచకోత కోశారని వెల్లడించింది. ఉత్తర మౌంగ్‌డాలోని ఖా మౌంగ్ సేక్ గ్రామంలో ఈ దారుణం జరిగిందని, చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారని వివరించింది. తమ తాజా దర్యాప్తులో ఈ విషయాలు వెలుగుచూసినట్టు నివేదికలో పేర్కొంది.