బెంగళూరు నుంచి లక్నోకు 178 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో శనివారం సాయంత్రం తీవ్ర కలకలం రేగింది. విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాలకే హైజాక్ బెదిరింపు రావడంతో, పైలట్లు దానిని వెంటనే వెనక్కి మళ్లించి బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

విమానంలోని టాయిలెట్‌లో చేతిరాతతో ఉన్న ఒక బెదిరింపు లేఖను ప్రయాణికుడు గుర్తించాడు. “సాయంత్రం 6:30 గంటలకు ఈ విమానాన్ని హైజాక్ చేస్తాం. దీనిని పట్టించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని ఆ లేఖలో రాసి ఉంది. ఆ ప్రయాణికుడు వెంటనే క్యాబిన్ సిబ్బందికి సమాచారం అందించగా, వారు పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు.

విమానం ల్యాండ్ అయిన తర్వాత, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 90 నిమిషాల పాటు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అది బూటకపు బెదిరింపు అని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం, రాత్రి సమయంలో ఆ విమానం తిరిగి లక్నోకు బయలుదేరి వెళ్లింది.