లోకనాయకుడు కమల హాసన్ తన తదుపరి చిత్ర శీర్షికను అధికారికంగా ప్రకటించాడు. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘సండియార్’  అనే పేరును ఖరారు చేశారు. నవంబర్ 7న కమల్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆయన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ శుక్రవారం ఈ ప్రకటన వెలువరించింది.

ఈ శీర్షిక వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. సుమారు 22 ఏళ్ల క్రితం, అంటే 2004లో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో విడుదలైన ‘విరుమాండి’ చిత్రానికి తొలుత ‘సండియార్’ అనే పేరునే అనుకున్నారు. అయితే, అప్పట్లో కొన్ని వర్గాల నుంచి తలెత్తిన తీవ్ర వ్యతిరేకత, వివాదాల కారణంగా ఆ టైటిల్‌ను ‘విరుమాండి’గా మార్చాల్సి వచ్చింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్ మళ్లీ అదే పేరును తన కొత్త సినిమాకు ఎంపిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో కమల హాసన్ కారు కిటికీలోంచి రివాల్వర్ పట్టుకుని గంభీరంగా కనిపిస్తున్నాడు. కారు డోర్‌పై ఉన్న రక్తపు మరకలను బట్టి చూస్తుంటే, ఇది ఒక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది.

కమల హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీతలు అన్బరివ్ స్టంట్ కొరియోగ్రఫీ నిర్వహిస్తుండగా, సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.