అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో తీవ్ర కలకలం రేగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేస్తానని బెదిరించిన ఓ వ్యక్తిని భారీ ఆయుధాలు సహా యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అరెస్ట్ చేశారు. తన తలలోని స్వరాలు ట్రంప్‌ను చంపమని ఆదేశించాయని, అందుకే ఇక్కడికి వచ్చానని నిందితుడు చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

గురువారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని కాన్‌స్టిట్యూషన్ అవెన్యూలో పార్క్ చేసి ఉన్న వాహనంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని వెనిజులాకు చెందిన రోనీ యోడ్రిక్స్ గువానిపా క్రినోస్‌గా గుర్తించారు. ట్రంప్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజధానికి వచ్చినట్లు అతడు అధికారులతో చెప్పాడు.

అనంతరం అధికారులు అతడు ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా, అది దొంగిలించబడినదని తేలింది. వాహనం లోపల ఏఆర్-15 తరహా రైఫిల్, మ్యాక్-10, గ్లాక్ 43ఎక్స్ వంటి మూడు శక్తిమంతమైన తుపాకులతో పాటు వందల సంఖ్యలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

క్రినోస్ 2024 మార్చిలో టెక్సాస్ సరిహద్దు ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని, అప్పటి నుంచి ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండా ఇక్కడే ఉంటున్నాడని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వెల్లడించింది. "మా సీక్రెట్ సర్వీస్ అధికారుల చొరవతో పెను ప్రమాదం తప్పింది. అతడు ఎవరికైనా హాని కలిగించేలోపే మూడు తుపాకులు కలిగి ఉన్న అతడిని వైట్‌హౌస్ సమీపంలో అరెస్ట్ చేశాం" అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నిందితుడిపై ఆయుధాల చట్టాల ఉల్లంఘన, వాహనం అక్రమ వినియోగం, దొంగతనం, రిజిస్ట్రేషన్ లేని ఆయుధాలు కలిగి ఉండటం వంటి పలు అభియోగాలపై కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ నిరాకరించి కస్టడీకి తరలించారు. దొంగిలించిన ట్రక్కులోనే తాను నివసిస్తున్నట్లు క్రినోస్ విచారణలో అంగీకరించినట్లు కోర్టు పత్రాల ద్వారా తెలిసింది. ఈ కేసును ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కూడా సమీక్షిస్తున్నందున, కేసు ఫెడరల్ కోర్టుకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.