ప్రముఖ దర్శకుడు నితేశ్ తివారీ ‘రామాయణం’ సినిమాలో లక్ష్మణుడి పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చానని, తుది దశ వరకు వెళ్లానని ప్రముఖ టీవీ నటుడు కరణ్ జోత్వానీ తాజాగా వెల్లడించాడు. ‘బెబాకీ’ సీరియల్‌తో గుర్తింపు పొందిన ఆయన, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు.

2022 అక్టోబర్‌లో ‘రామాయణం’ చిత్ర సెట్‌లో లక్ష్మణుడి పాత్ర కోసం తాను కాస్ట్యూమ్ ట్రయల్ కూడా పూర్తి చేశానని కరణ్ తెలిపాడు. ఆనాటి లుక్ టెస్ట్ ఫొటోను షేర్ చేస్తూ, ఆ అనుభవం తనకో అద్భుత ప్రపంచాన్ని పరిచయం చేసిందని పేర్కొన్నాడు. ఆడిషన్ ప్రక్రియ ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగిందని, ఫలితంతో సంబంధం లేకుండా అంకితభావంతో పనిచేయాలనే నమ్మకాన్ని ఆ చర్చలు తనకు నేర్పాయని రాసుకొచ్చాడు.

అయితే, ఈ పాత్ర తనకు దక్కనప్పటికీ, లక్ష్మణుడిగా నటించిన రవి దూబేపై కరణ్ ప్రశంసలు కురిపించాడు. "లక్ష్మణుడి పాత్రకు రవి ప్రాణం పోసిన తీరు అద్భుతమని వింటున్నాను. టీవీ రోజుల్లో నుంచే ఆయనంటే నాకు ఎంతో అభిమానం" అని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో రాముడి పాత్ర పోషిస్తున్న రణ్‌బీర్ కపూర్ తన ఫేవరెట్ నటుడని చెబుతూ, దర్శకుడు నితేశ్ తివారీతో పాటు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.

‘రామాయణం: పార్ట్ 1’ ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు.