ఉన్మాది దాడిలో గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లా రాప్తాడు బాలికను మంత్రి సవిత శుక్రవారం పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని వైద్యులు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.

ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని, ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదిస్తూ బాలిక ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని సవిత తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున డాక్టర్ గంగాధర్ రెడ్డి వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, యువత భవిష్యత్తును నాశనం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మహిళలు, బాలికల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.