మహిళా కండక్టర్‌ ప్రవళిక మృతి తెలంగాణ ఆర్టీసీలో కీలక మార్పుకు దారితీసింది. ప్రయాణికుల భద్రతతో పాటు సిబ్బంది రక్షణకు సంస్థ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే అన్ని బస్సులకు తప్పనిసరిగా డోర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డోర్లు పూర్తిగా మూసిన తర్వాతే బస్సులు కదలాలని ఆదేశించింది. డోర్లు లేని బస్సులను గుర్తించి వెంటనే వాటిని అమర్చాలని అధికారులకు సూచించింది.

ఆర్టీసీ పరిధిలోని అన్ని రకాల బస్సులకు ఈ నిబంధన వర్తించనుంది. ఇప్పటివరకు డోర్లు లేకుండా నడుస్తున్న బస్సులను గుర్తించి తక్షణమే తలుపులు ఏర్పాటు చేయాలని సంస్థ ఆదేశించింది. ఇకపై బస్సు బయలుదేరే ముందు డోర్లు మూసి ఉన్నాయో లేదో సిబ్బంది నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ప్రవళిక మృతి నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ ప్రవళిక విధుల్లో ఉండగా టికెట్‌ విషయంలో ఓ మహిళా ప్రయాణికురాలితో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ప్రయాణికురాలు ఆమెను బస్సు నుంచి బయటకు నెట్టివేయడంతో ప్రవళిక కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రవళిక కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం, ఆర్టీసీ సంయుక్తంగా రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు తెలిపారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీ ప్రత్యేక పాలసీ ద్వారా మరో రూ.కోటి ప్రమాద బీమా కూడా కుటుంబానికి అందనుంది.