బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోమవారం శుభవార్త అందించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, వెంటిలేటర్ సపోర్ట్ తొలగించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పూర్తిగా స్పృహలోకి వచ్చి, చురుగ్గా స్పందిస్తోందని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

మంత్రి నారా లోకేశ్ తన తాజా పోస్టులో, "చిన్నారి వేగంగా కోలుకుంటోందన్న సంతోషకరమైన వార్తను పంచుకుంటున్నాను. వెంటిలేటర్ తొలగించారు. పాప స్పృహలోకి వచ్చింది, ప్రతిస్పందిస్తోంది. అంతేకాదు, తన స్కూల్ టీచర్ గురించి అడుగుతోంది. ఇది ఆమె ధైర్యానికి, మన వైద్యుల అద్భుతమైన సంరక్షణకు నిదర్శనం. ఆమె త్వరగా పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.

అంతకుముందు కూడా లోకేశ్ ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఒక అప్‌డేట్ ఇచ్చారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో బాలిక ఆరోగ్యం నిలకడగా మెరుగుపడుతోందని తెలిపారు. ఆ సమయంలోనే ఆమె తల్లి కూడా ఆసుపత్రికి వెళ్లి బాలికను చూసిందని పేర్కొన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతున్న తీరును బట్టి సోమవారం సాయంత్రానికి వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు లోకేశ్ అప్పుడు వివరించారు.

చెప్పినట్లుగానే వైద్యులు వెంటిలేటర్ తొలగించడం, బాలిక కోలుకుని మాట్లాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి లోకేశ్ వరుస అప్‌డేట్‌లతో ఆ చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేస్తుండటం, ఆమె కోలుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై హేమంత్ అనే యువకుడు కిరాతకంగా దాడి చేయడం తెలిసిందే. ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేయడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. తొలుత బాలికకు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. బాలిక తరలింపు సందర్భంగా మంత్రి లోకేశ్ చొరవతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, బాలికను లోకేశ్ స్వయంగా బెంగళూరు వెళ్లి పరామర్శించారు. 

అటు, నిందితుడు హేమంత్ ను పోలీసులు పట్టుకునే ప్రయత్నంలో అతడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాళ్లకు బుల్లెట్ గాయాలు కావడంతో హేమంత్ ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ గాయాల కారణంగా అతడి రెండు కాళ్లు తొలగించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది.