మధ్యప్రదేశ్‌లో కర్వా చౌత్‌ పండుగ సందర్భంగా భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం పోలీసుల వరకు వెళ్లింది. తన కోసం భార్య కర్వా చౌత్‌ వ్రతం చేయలేదని, చంద్రుడికి పూజ కూడా చేయలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు, ఈసారి కూడా పూజ చేయకపోతే విడాకులు ఇస్తానని భార్యను హెచ్చరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

శివపురి జిల్లా బిజ్రావన్‌ గ్రామానికి చెందిన బరేలాల్‌ ఆదివాసీ తన భార్య మిథిలేశ్‌ ఆదివాసీపై బదర్వాస్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. భార్య తనకు నమ్మకంగా ఉండటం లేదని, తన కోసం ఉపవాసం ఉండటానికి నిరాకరించిందని ఆరోపించాడు. కర్వా చౌత్‌ సందర్భంగా చంద్రుడిని చూసి తన దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలని కోరినా ఆమె పట్టించుకోలేదని ఫిర్యాదులో రాశాడు. అంతేకాకుండా, భార్య తనను చంపాలని చూస్తోందని కూడా ఆరోపించాడు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన కొలారస్‌ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి సంజయ్‌ మిశ్రా.. మహిళా పోలీసు అధికారి సహాయంతో దంపతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, వారి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.