తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకంపై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన భార్య ఫ్రీ బస్సు ఎక్కి వెళ్లిపోయిందని, ఆమె ఆచూకీ తెలియడం లేదని ఎమ్మెల్యే ఎదుట అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన భార్య కనిపించకుండా పోవడానికి ఉచిత బస్సు పథకమే కారణమంటూ దాన్ని రద్దు చేయాలని కోరాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ నియోజకవర్గం బెజ్జంకి మండలం రేగులపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి కనకయ్య అనే వ్యక్తి తన కుటుంబ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు.

తన భార్యతో గొడవ జరగడంతో ఆమెను మందలించానని, దీంతో ఆమె ఉచిత బస్సు ఎక్కి వెళ్లిపోయిందని కనకయ్య తెలిపాడు. రెండు మూడు రోజులుగా వెతుకుతున్నా ఆమె ఆచూకీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె కోసం వెతకడానికి ఇప్పటికే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

తన భార్య కనిపించకుండా పోవడానికి ఉచిత బస్సు పథకమే కారణమని భావిస్తున్నట్లు కనకయ్య ఎమ్మెల్యేకు తెలిపాడు. అందుకే ఆ పథకాన్ని రద్దు చేయాలని కోరాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. మహిళ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఉచిత బస్సు పథకం వల్ల రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని పేర్కొన్నారు.