హైదరాబాద్‌లో ఓ వాహనానికి ఉన్న ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై వచ్చిన ఫిర్యాదుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పందించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తప్పుబట్టడంతో, పోలీసులు తమ మొదటి స్పందనను తొలగించి, తప్పును సరిదిద్దుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఈ ఘటన పోలీసుల సోషల్ మీడియా నిర్వహణపై చర్చకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఓ ఎలక్ట్రిక్ వాహనం ఫొటోను ఓ వ్యక్తి 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వాహనం నంబర్ ప్లేట్‌పై అంకెలను 'SRI' (శ్రీ) అని కనిపించేలా స్టైలిష్‌గా మార్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, సదరు యూజర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన ట్రాఫిక్ పోలీసులు.. "వాహనం వెనుక నుంచి ఫొటో తీయడం వల్ల ఉల్లంఘన స్పష్టంగా కనిపించడం లేదు. దయచేసి వాహనం ముందు వైపు ఫొటో పంపగలరు" అని రిప్లై ఇచ్చారు. పోలీసుల ఈ సమాధానంపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఫ్యాన్సీగా మార్చిన నంబర్ ప్లేటే ఉల్లంఘన అని, అది ఫొటోలో స్పష్టంగా కనిపిస్తున్నా ముందు వైపు ఫొటో ఎందుకని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు.

నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. తాము మొదట ఇచ్చిన సమాధానాన్ని డిలీట్ చేశారు. అనంతరం కొత్తగా మరో ప్రకటన విడుదల చేశారు. "ఉల్లంఘనను మా దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు. నంబర్ ప్లేట్‌పై అక్షరాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ముందు, వెనుక రెండు నంబర్ ప్లేట్లకూ నిబంధనలు వర్తిస్తాయి. వాహనం వివరాలు సేకరించాం. మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం" అని తెలిపారు. వాహనాలకు ప్రభుత్వం నిర్దేశించిన 'హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు' (హెచ్ఎస్ఆర్‌పీ) మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.