అర్నబ్ తుపాను ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టాన్ని నివారించడమే ప్రథమ కర్తవ్యమని, ఈ కష్టకాలంలో రైతులకు పూర్తి అండగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన పంటల సంరక్షణ, పునరుద్ధరణ, సహాయక చర్యలపై ఈ సమావేశంలో క్షుణ్ణంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుడి నుంచి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిర్దేశించారు. "కోతకు సిద్ధంగా ఉన్న పంటలు, ఇప్పటికే కోసి కళ్లాల్లో ఉంచిన ధాన్యం నిల్వలు దెబ్బతినకుండా రైతులకు తక్షణమే అవసరమైన సాంకేతిక సూచనలు, సలహాలు అందించాలి. వాతావరణం అనుకూలించిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, నేరుగా రైతులతో మాట్లాడి వారిలో భరోసా నింపాలి" అని ఆయన ఆదేశించారు. 

ముఖ్యంగా నీట మునిగిన పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపే ఏర్పాట్లు చేయడం, పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

పంట నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కచ్చితంగా జరగాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామాల వారీగా, పంటల వారీగా, రైతుల వారీగా నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి రైతు సమస్యపై సానుకూలంగా స్పందించి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వరాదని హెచ్చరించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు జిల్లా యంత్రాంగంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

"నష్టపోయిన రైతుల వివరాలను త్వరితగతిన సేకరించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి రైతుకూ సకాలంలో నష్టపరిహారం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయండి. కష్టకాలంలో రైతులకు ధైర్యాన్ని నింపడమే అధికారుల ప్రథమ కర్తవ్యం. యంత్రాంగమంతా సమష్టిగా పనిచేసి రైతులను ఆదుకోవాలి" అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ మంజీర్ జిలానీ, ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీనివాసులుతో పాటు ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.