బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తన ప్రియుడు శిఖర్ పహారియాతో ఉన్న బంధం గురించి తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తన తల్లి, దిగ్గజ నటి శ్రీదేవి మరణించిన కష్టకాలంలో శిఖర్ తనకు ఎలా అండగా నిలిచాడో గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్' షోలో నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.

2018లో శ్రీదేవి ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కుంగదీసిందని, ఆ సమయంలో శిఖర్ తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి తనకు అండగా నిలిచాడని జాన్వీ వెల్లడించారు. "ఆ సమయంలో శిఖర్ లండన్‌లో చదువుతున్నాడు. నేను ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి, తన చదువును సగం సెమిస్టర్‌ లోనే వదిలేసి ముంబై వచ్చేశాడు. అప్పుడు మేము డేటింగ్‌లో కూడా లేము. అతను మొదట తన తండ్రితో కలిసి ఉండేవాడు. కానీ నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అతను నాకోసం జుహులోని ఒక స్నేహితుడి ఇంట్లో నెలరోజుల పాటు ఉన్నాడు. నాకు అవసరం వస్తే అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే అతను అలా చేశాడని నాకు తర్వాత తెలిసింది" అని జాన్వీ గుర్తుచేసుకున్నారు.

2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్ గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి మరణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త యావత్ సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లి మరణంతో జాన్వీ, ఆమె సోదరి ఖుషీ తీవ్రమైన విషాదంలో మునిగిపోయారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో శిఖర్ మద్దతు తనకెంతో ధైర్యాన్నిచ్చిందని జాన్వీ పరోక్షంగా తెలిపారు.

జాన్వీ కపూర్, శిఖర్ పహారియా చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, వారిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కుటుంబ కార్యక్రమాల్లో, ఇతర వేడుకల్లో వీరిద్దరూ కలిసే కనిపిస్తుండటంతో ఈ వార్తలకు బలం చేకూరింది. గతంలో ఇదే షోలో తన స్పీడ్ డయల్‌లో ఉన్న ముగ్గురిలో 'షికూ' (శిఖర్ ముద్దుపేరు) ఒకరని జాన్వీ చెప్పడం, తన తండ్రి బోనీ కపూర్ సినిమా 'మైదాన్' స్క్రీనింగ్‌లో శిఖర్ పేరు ఉన్న నెక్లెస్‌తో కనిపించడం వంటివి వారి బంధాన్ని ధృవీకరించాయి. శిఖర్ అంటే తన తండ్రి బోనీ కపూర్‌కు కూడా ఎంతో ఇష్టమని జాన్వీ పలుమార్లు చెప్పారు.